జగన్ తానొకటి తలిస్తే.. వైసీపీ నేతలు మరొకటి తలుస్తున్నారు. అధికారం పోతే పోయింది అయినా ఇంకా అప్పర్ హ్యాండ్ తమదే అన్న ధీమాతో జగన్ ఉంటే అది కూడా జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు పార్టీ మారతారని, వాళ్లను కాపాడుకోవడం ఎలా అని జగన్ లెక్కలు వేసుకుంటోంటే.. అధికార పార్టీ మాత్రం అటు నుంచి నరుక్కుంటూ వస్తున్నట్టు కనిపిస్తోంది. శాసన సభలో కావాల్సినంత బలం ఉండటంతో.. కేవలం మండలిపైనే దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాల అనంతరం వైసీపీ నుంచి వలసలు మొదలు అవుతాయని ప్రచారం జరుగుతోన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం మంత్రి లోకేష్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ఒకటి రెండు రోజుల్లో టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరిగి వచ్చాక ఆయన సమక్షంలోనే జకియా ఖానం టీడీపీలో చేరుతారని అంటున్నారు.
కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, కూటమి పార్టీల నుంచి ముఖ్యంగా టీడీపీ, జనసేన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లేకపోవడంతో వారంతా సైలెంట్ అయ్యారు. అయితే, గత కొద్ది రోజులుగా మంత్రి , ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవుతోన్న మండలి డిప్యూటీ చైర్మన్ తాజాగా లోకేష్ ను కలవడంతో ఆమె టీడీపీలో చేరిక దాదాపు కన్ఫాం అయినట్టేననే టాక్ నడుస్తోంది.
Also Read : జగన్ కు షర్మిల సూటి ప్రశ్నలు… జవాబు చెప్పే దమ్ముందా?
మండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీతో ఉండటంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని జగన్ భావించారు. ఈమేరకు ఏనాడూ ఎమ్మెల్సీలను పెద్దగా పట్టించుకోని జగన్..ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి వారితో భేటీ అయి..హితబోధ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీలను నెత్తిన పెట్టుకోవడానికి ఆయన స్వీయ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఎమ్మెల్సీలు తమ సన్నిహిత నేతల వద్ద అభిప్రాయపడినట్లు తెలిసింది.
పైగా.. మండలిలో కూటమి సర్కార్ తీసుకొచ్చే కీలక బిల్లులను అడ్డుకోవాలని జగన్ చెబుతున్నారు. జగన్ సూచన మేరకు వ్యవహరిస్తే ఎమ్మెల్సీలు తమ క్రెడిబులిటీ దెబ్బతింటుందని భావిస్తున్నారు. దీంతో రాజకీయ భవిష్యత్, ఏపీ ప్రయోజనాల కోసం వైసీపీకి గుడ్ బై చెప్పడమే సరైందని పలువురు ఎమ్మెల్సీలు ఓ అభిప్రాయానికి వస్తున్నారు. జకియా ఖానం చేరిక పూర్తి కాగానే మరికొంతమంది ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతారని అంటున్నారు.