జగన్ ను వైఎస్ షర్మిల పూర్తిగా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నారు. జగన్ విషయంలో ఆమె ఎక్కడా తగ్గడం లేదు. వైసీపీ చేస్తోన్న రాజకీయాలపై మొదలుకొని జగన్ ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై జగన్ వ్యవహాశైలిని కూటమి నేతల కన్నా షర్మిలే పవర్ ఫుల్ గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కూటమి నేతలకు భయపడి ఇంట్లో కూర్చుంటావా..? వెంటనే పదవికి రాజీనామా చేయాలని గట్టిగానే డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా జగన్ ను షర్మిల వరుసగా కార్నర్ చేస్తున్నా..జగన్ అండ్ కో నుంచి పెద్దగా ఎదురుదాడి లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది.ఎందుకు వైసీపీ నేతలు షర్మిల వ్యాఖ్యలపై స్పందించేందుకు వెనకడుగు వేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
Also Read : జగన్ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్
అయితే, భవిష్యత్ రాజకీయాల కోసమే షర్మిలపై వైసీపీ నుంచి ఎదురుదాడి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో జగన్ అండ్ కో ఏం చేసినా అది జగన్ ప్రయత్నాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. జగన్ చేస్తోన్న ఈ ప్రయత్నాలను నిర్వీర్యం చేసేందుకే షర్మిల నేరుగా జగన్ తో జగడానికి దిగుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీటిని అంచనా వేసే జగన్ రెడ్డి నోరు మెదపడం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.