తెలంగాణ ప్రభుత్వం లే ఔట్ రెగ్యులరైజేేషన్ స్కీమ్ ను కంప్లీట్ చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. తమ ప్లాట్లను మళ్లీ రెగ్యులరైజ్ చేసుకోవాలా అని మధనపడుతున్నారు. దీనిపై సమగ్ర సమాచారం తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ – LRS
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం వేసే లే ఔట్లు నిబంధనల ప్రకారం ఉండాలి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. రోడ్ల కోసం నిబంధనల ప్రకారం వెడల్పుతో నిర్మించాలి. ఇంకా పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లాంటి కామన్ ఏరియాల్లో భూమిని వదిలి పెట్టాలి. కానీ చాలా మంది రియల్టర్లు వీటిని పాటించకుండా లే ఔట్లు వేసేస్తున్నారు. లేఔట్లలో ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కానీ ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు లే ఔట్ నిబంధనల ప్రకారం లేదు కాబట్టి పర్మిషన్లు రావు. అందుకే రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది.
Read Also :ఔటర్, రీజనల్ రింగ్రోడ్ల మధ్యలో పారిశ్రామిక క్లస్టర్లు
భారీగా ఉల్లంఘనలు – దరఖాస్తులే సాక్ష్యం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం ప్రకటించగానే వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి. 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే ఎంత భారీ స్థాయిలో ఉల్లంఘనలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
బిల్డింగ్ రెగ్యూలరైజేషన్ స్కీమ్ వేరు
చాలామంది తమ ఇంటికి ఎల్ఆర్ఎస్ కట్టాలా అని టెన్షన్ పడుతూంటారు. అయితే ఖాళీ ప్లాట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది. ఇంటి నిర్మాణం అయితే బిల్డింగ్ లెగ్యులరైజేషన్ స్కీమ్ ఉంటుంది. దాన్నిఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. నిబంధనలక విరుద్దంగా కట్టిన భవనాల విషయంలో ఈ స్కీమ్ వర్కవుట్ అవుతుంది.