జేసీ ప్రభాకర్ రెడ్డి అనగానే జగన్ పై ఒంటికాలితో లేస్తారు… తీవ్రంగా ఆరోపిస్తారన్నది అందరికీ తెలిసిందే. జగన్ సీఎం కాగానే… జేసీ సోదరులను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నించినట్లు అనేక సార్లు జేసీ మీడియా ముందే ప్రకటించారు.
జగన్ ఘోర ఓటమి తర్వాత కూడా తనను జైల్లో పెట్టిన అధికారులతో పాటు జైల్లో కనీసం తనకు తినేందుకు కూడా సరైన ఆహరం అందకుండా చేశారంటూ పేర్లు చెబుతూ మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తమపై కేసులు పెట్టేందుకు ఏం ఆధారాలున్నాయంటూ ఇటీవల ఏకంగా పోలీసు బాసులను కూడా కలిశారు.
అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి… వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ఎందుకు భేటీ అనేది బయటకు తెలియాల్సి ఉన్నప్పటికీ, విజయమ్మ కూడా జేసీని కలిసేందుకు ఒప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే విజయమ్మ పూర్తిగా వైఎస్ షర్మిలకు రాజకీయంగా అండగా ఉంటున్నారని, జగన్ తో సరైన సంబంధాలు లేవన్నది ఓపెన్ సీక్రెట్. మొన్నటి ఎన్నికల ముందు రోజు కూడా షర్మిలను గెలిపించాలని ఓపెన్ గానే విజయమ్మ వీడియో రిలీజ్ చేశారు. సరే, అది ఫ్యామిలీ ఇష్యూ అని అంతా అనుకుంటున్న సందర్భంలో.. విజయమ్మ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసేందుకు ఒప్పుకోవటం చర్చనీయాంశం అవుతోంది.