ప్రకృతి ప్రకోపానికి కేరళలోని వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడటంతో ఊహించని విధంగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి గంటలు గడుస్తున్నా కొద్దీ ఆందోళనకర విషయాలు వెల్లడి అవుతున్నాయి.ఇప్పటివరకు 93 మంది మృత్యువాత పడ్డారని తేలినా..ఎంత మంది మరణించారు అనే విషయంలో స్పష్టత లేకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఈ నేపథ్యంలో 600 మంది ఆచూకీ గల్లంతు అయిందనే వార్త యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ముండకై ప్రాంతంలో తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పని చేసేందుకు వెస్ట్ బెంగాల్ , అస్సాం నుంచి వందల మంది వస్తుంటారు. మలయాళీ ప్లాంటేషన్ లో పని చేయడానికి ఆరు వందల మంది రాగా.. వీరంతా ముండకైలోనే ఉంటున్నారు. వరద భీభత్సానికి కొండ చరియలు విరిగి పడటంతో అదే ప్రాంతంలో ఉంటున్న వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీంతో వారు ఏదైనా ప్రాంతంలో క్షేమంగానే తల దాచుకున్నారా..? లేక ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా..? తెలిసి రావడం లేదు.
మొబైల్ ఫోన్ నెట్ వర్క్ లు కూడా పని చేయకపోవడంతో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. అయితే , ఈ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడటంతో ఇల్లు ధ్వంసం అయ్యాయి. ఇక్కడ నివాసం ఉంటున్న వలస కార్మికుల వివరాలు తెలుసుకొని వారిని గుర్తించడం.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం అధికారులకు సవాల్ గా మారింది. ఇదిలా ఉండగా..వయనాడ్ లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మృతదేహాలు చెల్లాచెదురు అయ్యాయి. వరదలో ఓ మూడేళ్ల పాప మృతదేహం కొట్టుకురావడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.