వైసీపీ హయాంలో కీలక నేతలతో సన్నిహితంగా ఉన్న అధికారుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో సన్నిహితంగా వ్యవహరించిన నాటి చిత్తూర్ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నిబంధనలకు పాతరేసి వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం చేపట్టారు. పెద్దిరెడ్డి సిఫార్స్ చేసిన వ్యక్తులకు ఉద్యోగాలు కట్టబెట్టారని.. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
అయితే, నిబంధనలకు విరుద్దంగా నియామకాలు చేపట్టలేమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు షాన్ మోహన్ కు వివరించగా.. అందుకు ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తనకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను నియమించుకున్నారు. నిబంధనలను గుర్తు చేసే అధికారులను మెడికల్ లీవ్ లో పంపేసి..ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డిని ఇంచార్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నియమించుకున్నారు.
Also Read : పెద్దిరెడ్డిపై అనర్హత వేటు కత్తి వేలాడుతుందా?
చిత్తూర్ జిల్లాలో వైసీపీ చివరి ఏడాదిన్నరలో కంప్యూటర్ ప్రోగ్రామర్, ల్యాబ్ టెక్నిషియన్, స్టాఫ్ నర్స్, పారా మెడికల్ కేటగిరికి చెందిన 600పోస్టులకు 400 భర్తీ చేశారు. ఇందులో పదిశాతం కూడా అర్హులైన వారు లేరని పలువురు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేయని వారికి సైతం ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.పెద్దిరెడ్డి సూచించిన వ్యక్తులకు ఉద్యోగాలు కట్టబెట్టి అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ ఉద్యోగార్ధులు వాపోతున్నారు.
షాన్ మోహన్ హయాంలో చేపట్టిన నియామకాల్ని రద్దు చేసి అర్హులకు న్య్యయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ ఉద్యోగాల నియామకంపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డిపై పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు వస్తుండగా.. కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకంలోనూ ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలతో పెద్దిరెడ్డి దేన్నీ వదల్లేదని అంటున్నారు.