వరంగల్ జాతీయ రహదారిలో నిర్మిస్తోన్న ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ ఎన్నటికీ పూర్తి అవుతుందో అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి భువనగిరి వెళ్ళే రూట్ లో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ దారిలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 600 కోట్లతో ఆకాశమార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం ముందుకు రాగా.. ఈ కాంట్రాక్ట్ ను గాయత్రి సంస్థ దక్కించుకుంది. 2018లో పనులు ప్రారంభమైనా చెప్పుకోదగ్గ స్థాయిలో పనులు సాగడం లేదు.
85శాతం పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు. మిగత పనులు ఎక్కడివక్కడే అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రోడ్డుపై పెద్ద గోతులు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ రద్దీతో ఐదేళ్ళుగా నరకం అనుభవిస్తున్నారు. దీంతో పనులు తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నారు.
ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కాంట్రాక్ట్ పొందిన గాయత్రి సంస్థను తప్పించి మరొకరికి అప్పగించాలని కేంద్ర మంత్రిని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినా..గుత్తేదారు సంస్థ కోర్టును ఆశ్రయిస్తే ఆ సంస్థకు కేంద్రం భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది.
దీంతో ఎలివేటెడ్ కారిడార్ ను గాయత్రి సంస్థ నిర్మిస్తుందా ..? మరో సంస్థకు కాంట్రాక్ట్ అప్పగిస్తారా..? క్లారిటీ లేకుండా పోవడంతో పనులు ఎప్పటికీ పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.