తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సమయం, సందర్భాన్ని బట్టి కొంత మందిపై అనర్హతా వేటు కూడా పడుతుందని చెప్పారు. రేవంత్ వ్యూహాత్మకంగా ఈ మాట చెప్పారని ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే.. ఆయన ఆఫ్ ది రికార్డు చెప్పారు కానీ ఈ విషయం అందరికీ చేరేలా చెప్పారు. తన దగ్గర ఆ ఆస్త్రం కూడా ఉందన్న సంకేతాలు పంపారు.
గతంలో శాసనమండలి చైర్మన్ గా ఉన్న స్వామిగౌడ్ పై దాడి చేశారన్న కారణం చూపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లపై అప్పటి స్పీకర్ అనర్హతా వేటు వేశారు. ఇందు కోసం పెద్ద డ్రామా నడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి డ్రామాలు నడిపి తాను కూడా అనర్హతా వేటు వేయించగలనని రేవంత్ రెడ్డి సంకేతాలు పంపారు. ఆయన దృష్టిలో ఖచ్చితంగా టార్గెట్ ఉందని.. ఆ టార్గెట్ లో ఉన్న వారు ఎవరా అని కాంగ్రెస్ వర్గాలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
Also Read : ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్
అసెంబ్లీకి హాజరు కాకపోతే కేసీఆర్ పై అనర్హతా వేటు వేయించడానికి నిబంధనలు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో అనుచిత ప్రవర్తన దగ్గర నుంచి ఏదో ఓ కారణం చూపి స్పీకర్ తో అనర్హతా వేటు వేయిస్తే.. దానికి కోమటిరెడ్డి, సంపత్లకు ముడిపెట్టి సమర్థించుకునేందుకు అవకాశం ఉంటుంది. రేవంత్ బీఆర్ఎస్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కంగారు పడుున్నారు. ఇక ఎందుకైనా మంచిదని.. పద్దతిగా అసెంబ్లీలో ఉండాలన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కేసీఆర్ పద్దతుల్ని వాడుకుని .. కేసీఆర్ పార్టీని ఎలా దారికి తెచ్చుకోవాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.