ప్రజాస్వామ్యం లో చట్టసభలో దేవాలయాలు. అక్కడ జరిగే చర్చలతోనే దేశ, రాష్ట్ర ప్రజల భవిష్యత్ నిర్ణయమవుతుంది. కానీ మన దేశంలో ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎప్పటికప్పుడు అవహేళన చేసుకుంటూనే వస్తున్నారు ప్రజాప్రతినిధులు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ, తెలంగాణ అసెంబ్లీల్లో అవసరం లేని… ప్రజోపయోగంతో సంబంధం లేని అంశాలపైనే చర్చ జరుగుతోంది. ప్రజల్ని ఓ రకమైన భావోద్వేగానికి గురి చేసే లక్ష్యంతో ఎవరికి వారు సొంత వ్యూహాలు అమలు చేస్తున్నారు.
లోక్సభలో “రాహుల్ కులం”పై చర్చ
కులగణన అంశంపై లోక్సభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పరిధి దాటారు. ప్రతిపక్ష నేతకు జాతి లేదంటూ.. కులపరమైన ఆరోపణలు చేశారు. ఆయన కు కులమంటూ లేదని మండిపడ్డారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అనురాగ్ ఠాకూర్ కు మద్దతుగా స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాహుల్ పై అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల వీడియోను అందరూ చూడాలని పిలుపునిచ్చారు. ప్రధాని అలా అన్న తర్వాత వీరభక్తులు ఇక ఊరుకుంటారా.. అసలు రాహుల్ కులమేంటని ప్రశ్నలు.. చర్చలు ప్రారంభించారు.
Read Also :రేవంత్ ఎవరిపై అనర్హతా వేటు వేయించబోతున్నారు ?
తెలంగాణ అసెంబ్లీలో మరో రకమైన రాజకీయం
తెలంగాణ అసెంబ్లీ గాడిన పడిందని… అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయనుకుంటున్న సమయంలో… ఒక్కసారిగా దారి తప్పింది. ప్రజోపయోగం లేని రాజకీయ అంశాలను … వ్యక్తిగతంగా.. అంతర్గతంగా జరిగిన విషయాలను బయటకు తెచ్చుకుని తిట్టుకోవడం ప్రారంభించారు. చివరికి అది చర్చ పూర్తి కాకుండానే ద్రవ్య వినియమ బిల్లు ఆమోదానికి దారి తీసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మహిళల్ని అవమానపరిచారని బీఆర్ఎస్ సభను నడవనివ్వబోమని.. రోడ్డెక్కుతామని హడావుడి చేసింది. అక్కడ అంత అవమానమేం జరగలేదని..సభ జరగకుండా .. జరగనివ్వకుండా తప్పించుకునే ప్రయత్నమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా బీఆర్ఎస్ అదే దారిలో వెళ్తోంది.
చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చించినప్పుడే ప్రజాస్వామ్య వెలుగులు
చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొన్నప్పుడే ఆ సభలకు గౌరవం పెరుగుతుంది. ప్రజాస్వామ్య దేవాలాయాలపై ప్రజల్లో మరింత నమ్మకం కలుగుతుంది. అలా కాకుండా చట్టసభ సభ్యులు పనికిమాలిన నిందలు.. ప్రజల్లో విభజన తెచ్చే రాజకీయాలకు చట్టసభలను వాడుకోవడం ప్రజల్ని అవమానించడమే. దురదృష్టవశాత్తూ ఎక్కువగా అదే జరుగుతోంది.