ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ సీజన్ నడుస్తోంది. జూలై నెలాఖరు రోజున దాదాపుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏడు వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ అనంతర భత్యాలు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో గత జగన్ ప్రభుత్వం… రెండేళ్ల పదవీ విరమణ వయసు పెంచింది. దాంతో ఉద్యోగుల రిటైర్మెంట్లు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ రెండేళ్లు పూర్తయిపోవడంతో అందరూ మూకుమ్మడిగా రిటైర్ అవుతున్నారు. మొదట 58 ఏళ్లుగా ఉండే రిటైర్మెంట్ వయసు ఇప్పుడు అరవై రెండుకు చేరింది.
58 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఉంటే.. ఇప్పటికే మరో నలభై వేల మంది వరకూ రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలన్నీ యువతకు వచ్చేవి. కానీ రాజకీయ స్వార్థం… వారు రిటైరైతే జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితుల వల్ల వయసు పెంచుతూ వచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఓ సారి పదవీ విరమణ వయసు అరవై ఐదుకు పెంచాలన్న ఆలోచన చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. కానీ వివాదం రేగడంతో అలాంటిదేమీ లేదని సంకేతాలు ఇచ్చారు.
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ఇచ్చారు. రేపో మాపో కానిస్టేబుళ్ల ఎంపిక నోటిఫికేషన్ రానుంది. త్వరలో గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా విడుదల చేయనున్నారు. ఏపీలో … వచ్చే ఐదేళ్లూ ఉద్యోగాల జాతర కొనసాగే అవకాశం ఉంది. ప్రైవేటు రంగంలోనూ అవకాశాలు పెరగనున్నాయి.