ఈమధ్య సీజీ హడావుడి మరింత ఎక్కువైపోయింది. భారీ సెట్లు వేసే బదులుగా సీజీ సెటప్పులో సినిమాలు తీసేస్తున్నారు. దాంతో సెట్లకు పని తగ్గింది. అయితే ‘కల్కి’లో ఏకంగా 16 సెట్లు వేశారు. సినిమా చూస్తే మొత్తం సీజీ వర్క్ తో పూర్తి చేసినట్టు అనిపిస్తుంది. కానీ సెట్లు మాత్రం అవసరం అయ్యాయి. సీజీ, సెట్లు రెండింటి మేళవింపుతో ఓ విజువల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దారు దర్శకుడు నాగ అశ్విన్.
Also Read : ‘విశ్వంభర’లో హనుమాన్
ఇప్పుడు ‘విశ్వంభర’ టీమ్ కూడా అదే ఫాలో అవుతోంది. ఈ సినిమాలోనూ భారీ సెట్లు అవసరమయ్యాయి. ఇప్పటి వరకూ 8 సెట్లు వేశారు. మరో నాలుగు సెట్లయినా వేస్తారని టాక్. అంటే మొత్తానికి 12. ఆర్.ఎస్.ప్రకాష్ ఈ చిత్రానికి సెట్ వర్క్ చేస్తున్నారు. ఆయన కెరీర్లో ఇన్ని భారీ సెట్లు వేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో సెట్లకు సైతం ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇదో సోషియో ఫాంటసీ సినిమా. ఎవరూ చూడని కొత్త లోకాన్ని దర్శకుడు వశిష్ట సృష్టిస్తున్నాడు. ఆ లోకం, సెటప్ అన్నీ కొత్తగా ఉండబోతున్నాయట. అందుకే కళా దర్శకుడికి ఎక్కువ పని పడింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. ఈనెల 3 నుంచి అక్కడ ఓ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈనెల 22న చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘విశ్వంభర’ గ్లింప్స్ రాబోతోందని టాక్. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.