ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మర్చిపోవాల్సిందేనేమో అని దిగులుపడిన వారందరికీ ఇప్పుడు ఊరట లభిస్తోంది. మళ్లీ ఏపీ గురించి మంచి మంచి మాటలు వింటున్నారు. ఉద్యోగాల గురించి.. పెట్టుబడుల గురించి.. రాజధాని గురించి.. పోలవరం గురించి మాట్లాడుకుంటున్నారు. మన రాష్ట్రం.. మన ప్రదేశ్ అనే ఎజెండా ప్రజల్లోనూ కనిపిస్తోంది. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం… బతుకుల్ని బాగు చేసుకుందామన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఉన్నత స్థాయి పాలకుడిలోని కృషి పట్టుదల స్ఫూర్తి కింది వరకూ తీసుకెళ్లడానికి యాభై రోజుల పాలనలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దాన్ని సరి దిద్దుకుని ముందడుగు వేయాలంటే… పొలిటికల్ డైవర్షన్ లేకుండా కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడేందుకు అధికార పార్టీ రెడీగానే ఉంది కానీ.. లేని పోని ఫేక్ న్యూస్‌లతో…. అడ్డగోలుగా ప్రజాధనం దోచుకుని పెట్టిన మీడియా.. సోషల్ మీడియాలతో ప్రజలపైనే యుద్ధం చేసేందుకు ప్రజలు తిరస్కరించిన పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతూండటంతోనే ఉత్కంఠ ఏర్పడుతుంది. ఏపీకి ఈ బాధలు తప్పేదెప్పుడు అన్న ఆందోళన ప్రారంభమవుతుంది.
ఐదేళ్ల పాటు కక్షలు తీర్చుకోవడం, దోచుకోవడమే అజెండాగా జగన్ పాలన
రాజు ప్రాధాన్యాలు ఎలాంటివి అయితే.. పాలనలో కూడా ఉంటాయి. 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది..?. రాష్ట్రాన్ని ఎలాగోలా గాడిన పెట్టుకుందామని ప్రతి ఒక్కరూ తపన పడ్డారు. కేంద్రంలో భాగంగా ఉన్నప్పటికీ.. పెద్ద ఎత్తున ఎంపీలు పోరాడారు. ఐదేళ్ల పాటు ప్రతి రోజూ రాష్ట్రానికి అది రావాలి.. ఇది రావాలని కేంద్రం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చివరికి మిత్రపక్షంగా ఉన్నప్పటికి ప్రధాని ఇంటి ముందు కూడా ధర్నా చేశారు. ఇక రాష్ట్రాధినేత… విభజన తర్వాత ఆదాయం లేకుండా ఉండిపోయిన రాష్ట్రాన్ని ఆదాయార్జన రాష్ట్రంగా.. ఇతరులపై ఆధారపడకుండా ఉండేలా తీర్చిదిద్దేందుకు ఎన్ని దేశాలు తిరిగారో లెక్కలేదు. ఐదేళ్లలో ఊహించని మార్పులు ఏపీలో కనిపించాయి. పారిశ్రామికంగా ప్రతి జిల్లాలోనూ కొత్త పరిశ్రమలు వచ్చాయి. అంతకు మించి.. పెట్టుబడుల ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడింది. వందల మంది పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు చేసుకున్నారు. రాజదాని, పోలవరం పరుగులు పెట్టాయి. ఫీనిక్స్‌లా రాష్ట్రం ఎగురుతోందని సంబరపడ్డారు. కానీ ప్రజలు ఏం ఆలోచించారో కానీ.. 2019 ఎన్నికల ఫలితాలతో మొత్తం తిరగబడిపోయింది. 2019-24 మధ్య ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలు అన్న మాట వినిపించిందా.. ? జగన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏపీ విధ్వంసమే జరిగింది. అది వనరుల దగ్గర నుంచి ఇటు వ్యవస్థల వరకూ మొత్తం దిగజారిపోవడమే కానీ.. ఏ విషయంలో అయినా పైకి ఎదిగామా అన్న ఆలోచన ఎవరికీ రాలేదు. ప్రతీ రోజూ కక్ష సాధింపుల కోసం హైలేవల్ మీటింగ్‌లు పెడతారు కానీ.. ఒక్క నాడన్నా .. ఏపీ కోసం ఏం చేద్దామని ఒక్క ఆలోచన లేదు. అత్యధిక మంది ఎంపీల బలముంటే.. పార్లమెంట్ ఏపీ కోసం ఒక్క మాట మాట్లాడలేదు. తమ పార్టీ అధినేత కేసుల్లో సహనిందితుడు అయిన వ్యక్తిని ఎక్కడో సెర్బియా లో అరెస్టు చేస్తే ఆయనును విడిపించాలని విజ్ఞప్తి చేసేందుకు ఎంపీలంతా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలిశారు కానీ రాష్ట్రానికి ఓ ప్రాజెక్టు తెచ్చుకోవాలని కలిసింది లేదు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో జరిగినవి ఏమిటంటే.. ప్రతిపక్ష నేతలపై వేధింపులు, కేసులు. విధ్వంసం… ఘోరాలు.. అంతకు మించి ఏపీ జరగలేదు.
కలసి వచ్చిన కాలంతో చంద్రబాబు ముందడుగు
విభజిత ఆంధ్రప్రదేశ్ పదేళ్ల పాటు ఓ సారి దక్షిణకొరియా.. మరోసారి ఉత్తర కొరియాల్లా పరిపాలన చూసింది. ప్రజలకు 2019లో తాము చేసిన తప్పేంటో అర్థమయింది. అందుకే పూర్తి స్థాయిలో 2024లో దిద్దుకున్నారు. తమ బతుకులు మరీ రోడ్డున పడకుండా కాపాడుకున్నారు. కానీ అప్పటికీ జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడం మాత్రం.. ప్రభుత్వాన్ని మార్చినంత ఈజీ కాదు. 74 ఏళ్ల వయసులో అయినా చంద్రబాబు ఆ బాధ్యత నెత్తికెత్తుకున్నారు. తనను ముసలోడని అవహేళన చేసిన వృద్ధ యువకుడు జగన్ చేసిన విధ్వంసాన్ని పూడ్చి మళ్లీ ఏపీకి మంచి భవిష్యత్ కల్పించేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చంద్రబాబు.. రాజకీయం, ప్రకృతి కూడా సహకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కాకపోయినా.. చంద్రబాబు మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆయన తన నాయకత్వ లక్షణాలకు పదును పెట్టారు ఎక్కడా రాజకీయంగా అతికి పోకుండా తన రాష్ట్రానికి ఏం కావాలో అవి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బడ్జెట్లో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. పారిశ్రామికంగా భారీ ప్రాజెక్టులు కూడా కేటాయిస్తున్నారు. పాలనలోనూ ప్రజల్ని నిరాశ పర్చకుండా… ఖజానా ఖాళీగా ఉన్నా.. వారికి అందాల్సిన పథకాలను అందిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రణాళికా బద్దంగా అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుసగా రెండునెలల పాటు వాలంటీర్ల అవసరం లేకుండానే పించన్ల పంపిణీ చేసి .. పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు, అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
Read Also :ఆగిపోయిన నిర్మాణాలు పనికొస్తాయా?… అమరావతికి ఐఐటీ నిపుణులు
వ్యవస్థల్ని దారికి తేవడం అతి పెద్ద సవాల్
ఓపెనింగ్ బాగుంది కానీ.. చంద్రబాబు సీనియర్ ప్లేయర్ గా లాంగ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తే కానీ… జగన్ చేసిన విధ్వంసాన్ని కవర్ చేసుకుని.. అభివృద్ధిగా ముందడుగు వేయలేరు. ముఖ్యంగా వ్యవస్థల్ని కుళ్లబెట్టిన జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అడ్డగోలుగా దోచుకున్న అధికారులు… తాము విలాసంగా బతకడానికి అది సరిపోతుదంని ఎక్కడి వాళ్లు అక్కడ పరారవుతున్నారు. వారు చేసిన నిర్వాకాల్ని చూసి ఆశ్చర్యపోతున్న ప్రభుత్వం.. ప్రజా ధనాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఇంత అడ్డగోలుగా దోచుకునేందుకు ఎలా మనసొప్పిందని.. . ఆశ్చ్యపోవాల్సిన పరిస్థితి. డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులు ఏం ఆశించారో కానీ.. రాష్ట్రాన్ని ఊడ్చేశారు. అందులో వారికి ముట్టినదెంత… వారి బాసులు మెక్కినదెంత తేల్చాలంటే… ఒకటి, రెండు రోజుల్లో అయ్యే విషయం కాదు. అందుకే…. ముందుగా సమాచార సేకరణ చేస్తున్నారు. మొత్తం .. దోపిడీని బయటకు తీస్తున్నారు. ఇక నుంచి చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. ఆ విషయం తెలిసి.. అధికారులు పరారీలో ఉన్నారు. కానీ పట్టుకొచ్చి ప్రజాసంపద మొత్తం కక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఏపీకి మళ్లీ సానుకూల వాతావరణం
ఆంధ్రప్రదేశ్ మళ్లీ కాస్తయినా ముందుకు వెళ్లాలంటే పాజిటివ్ ఇమేజ్ కనిపించాలి. కూటమి భారీ విజయంతో అలాంటి ఇమేజ్ వచ్చేందుకు ఓ దారి ఏర్పడింది. పారిశ్రామిక వేత్తల్లో మళ్లీ నమ్మకం కల్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అందుకే లా అండ్ ఆర్డర్ పర్ ఫెక్ట్ గా ఉంటుందని.. వ్యవస్థలు అన్నీ రాజ్యాంగబద్దంగా పని చేస్తాయన్న నమ్మకాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో రాజకీయం చేసేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు. అధికారం అందగానే… తమను వేధించిన వారి అంతు చూడాలని గట్టిగా ఆశలు పెట్టుకున్న వారికి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు… నింపాదిస్తున్న వ్యవహరిస్తున్న వైనం.. కాస్త అసహనం కలిగిస్తోంది. కానీ వారు కోరుకున్నట్లుగా చంద్రబాబు కూడా పగ, ప్రతీకారాలతో పాలన సాగిస్తే.. ముందుగా నష్టపోయేది రాష్ట్రమే. అలా అని తప్పు చేసిన వారిని చూస్తూ ఊరుకోవాల్సిన అవసరమే లేదు. కానీ దేనికైనా సమయం అవసరం. టైం చూసి కొట్టే దెబ్బతో పాతాళానికి పడిపోయోలా ప్లాన్ చేసుకోవడమే కీలకం. చంద్రబాబు రాజకీయం సంప్రదాయంగానే ఉంటుంది కానీ ఈ సారి మరింత వైల్డ్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. మొదట ఆయన ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి తప్పు చేయకపోయినా జైలుకెళ్లారు. కుటుంబాన్ని వేధించారు. ఎంత ఘోరమైన పరిస్థితిని చూశారో వారికే తెలుసు. అలాంటి వ్యక్తి కూడా తనకు అధికారం వచ్చిన తర్వాత… ఫుల్ పవర్ చేతిలో ఉన్నా సంయమనం పాటిస్తున్నారంటే… అది ఎందుకో.. టీడీపీ క్యాడర్ త్వరలోనే అర్థం చేసుకునే అవకాశం ఉంది.
ఇన్ స్టంట్ కాదు లాంగ్ రన్లో తెలుస్తుంది !
చంద్రబాబును ప్రజలు గెలిపించింది ఎందుకు అన్నదానిపై అందరూ రకరకాల అభిప్రాయాలు చెబుతూంటారు. జగన్ రెడ్డి సంగతి తేల్చడానికి అని కొంత మంది.. అభివృద్ధి కోసమని మరికొందరు.. ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల కోసమని మరికొందరు చెబుతూ ఉంటారు. ఎవరి విశ్లేషణలు వారివి. అయితే ప్రజలు ఖచ్చితంగా తమ బాగు కోసమే చంద్రబాబును మళ్లీ ఎంచుకున్నారు. జగన్ రెడ్డి హయాంలో దిగజారిపోయిన బతుకుల్ని బాగు చేయడానికి ఎంచుకున్నారు. తమ ఇళ్లూ, ఒళ్ళు కాపాడుకునేందుకు ఎంచుకున్నారు. తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలన్న కారణంతో ఎంచుకున్నారు. ఈ విషయాలపై చంద్రబాబుకు స్పష్టత ఉంది. అందుకే తాత్కలిక రాజకీయ ప్రయోజనాలు, కక్ష సాధింపుల గురించి కాకుండా… ముందుగా ప్రజల బతుకుల్ని మార్చేందుకు ఓ ట్రాక్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఆ దిశగా ఆయన మొదటి అడుగులు విజయవంతంగా పడుతున్నాయి. తాము అనుకున్నట్లుగా చేయలేదని కొంత మందికి అసంతృప్తి ఉండవచ్చు కానీ.. రెండేళ్లు తిరిగే సరికి.. వారే .. ఇదీ చంద్రబాబు రాజకీయం అని అనుకుంటారు.. సామాన్య ప్రజలు కూడా ఆ తేడాను సులువుగా గుర్తిస్తారు. అందుకే.. ఇప్పుడు ఏపీకి మంచి రోజులు వచ్చాయని సగర్వంగా చెప్పుకోవచ్చు.