ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీఏ నుంచి విజయసాయిరెడ్డి గ్యాంగ్ మొత్తాన్ని బయటకు పంపించడం ఖాయమయింది. ఇప్పటికే కార్యకవర్గం మొత్తం రాజీనమా చేశారు. నాలుగో తేదీన సమావేశంలో ఆ రాజీనామాలను ఆమోదించి.. వెంటనే .. కొత్త కార్యవర్గం కోసం చర్యలు ప్రారంభించనున్నారు. ఏసీఏ అధ్యక్షుడిగా పలువురు పేర్లు పరిశీలనలోకి వస్తున్నప్పటికీ జేసీ పవన్ రెడ్డి ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
2019లో పార్లమెంట్ కు పోటీ చేసిన జేసీ పవన్ రెడ్డి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఆయన పోటీ చేయాలని చివరి నిమిషంలో అనుకున్నప్పటికీ … చంద్రబాబు అనంతపురం లోక్ సభ టిక్కెట్ ను బీసీ అభ్యర్థికి ఖరారు చేయడంతో సైలెంట్ అయిపోయారు. అయితే ఆయన తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ అస్మిత్ రెడ్డి కోసం గట్టిగా పని చేశారు. ఆరోగ్యం సహకరించకపోతూండటంతో జేసీ దివాకర్ రెడ్డి పెద్దగా బయట కనిపించడం లేదు.
జేసీ పవన్ రెడ్డికి అంతర్జాతీయ క్రికెటర్లతో మంచి స్నేహం ఉంది. క్రికెట్ పాలనపై అవగాహన ఉంది. ఈ క్రమంలో ఆయన అయితే.. ఏసీఏను గాడిన పెట్టగలరని భావిస్తున్నారు. జేసీ పవన్ రెడ్డితో పాటు క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరు కూడా పరిశీలనకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. జేసీ పవన్ రెడ్డి ఆసక్తిగా ఉంటే.. గట్టిగా ప్రయత్నిస్తే ఆయనకే ఖరారయ్యే అవకాశం ఉందని ఏసీఏ వర్గాలు చెబుతున్నాయి.