గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీఆర్ఎస్ ఆశలు అడియాశలు అయినట్లే. ఆయన మళ్లీ బీఆర్ఎస్ లో చేరారని హడావుడి చేశారు కానీ.. ఆయన మాత్రం.. పార్టీ మారానని చెప్పలేదు. కానీ ఆయన కాంగ్రెస్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది నిజం. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనతో చర్చించి.. రాజకీయంగా హడావుడి నిర్ణయాలు తీసుకుని నష్టపోవద్దని నచ్చచెప్పారు. దాంతో ఆయన కాంగ్రెస్లో కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Read Also :కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే !
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను కాంగ్రెస్ క్యాడర్ వ్యతిరేకించింది. పార్టీలో చేరిన తర్వాత కూడా ఎవరూ ఆయనను కలిసేందుకు రాలేదు. చివరికి ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్య కూడా ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు అంగీకరించలేదు. వీరెవరినీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సముదాయించలేదని.. కాంగ్రెస్ లో ఇమడలేని పరిస్థితులు కల్పిస్తున్నారని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయన మైండ్ గేమ్ ఆడారని అంటున్నారు. ఈ మైండ్ గేమ్ కోసం బీఆర్ఎస్ ను ఉపయోగించుకున్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి రివర్స్ లో ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ తొందరపడి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు తమతో పాటు టీ తాగేందుకు కూడా ఎవరూ రాకుండా చేసుకున్నారు. పాత పరిచయాలతో టీ తాగేందుకు వస్తే… పార్టీ మారుతారని ప్రచారం చేస్తారా అని ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ పై ఫైరయ్యారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా మళ్లీ ఝులక్ ఇవ్వబోతున్నారు.