వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవడం లేదు అని టీడీపీ క్యాడర్ గింజుకుంటున్నారు కానీ.. అసలు జరుగుతోంది వేరు. వైసీపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ భయం భయంగా బతుకుతున్నారు. తాడేపల్లికి అడపాదడపా వచ్చే జగన్.. ఉండే రెండు, మూడు రోజులు నిద్రలేకుండా గడుపుతున్నారు. రఘురామ కేసులో ఎత్తేయడానికి రాత్రికి రాత్రి పోలీసుల్ని పంపుతారేమో… ప్రజాధనంతో కొట్టేసిన ఫర్నీచర్ పేరుతో లారీలతో ఇంటికి వచ్చేస్తారేమో అని ఆయన కు కంటి మీద కనుకు ఉండటం లేదు. ఎలాగోలా పనులు పూర్తి చేసుకుని బెంగళూరు వెళ్లిపోవాలనుకుంటున్నారు. అదే చేస్తున్నారు. అధినేతే ఇలా కంటి మీద కునుకు లేకుండా ఉంటే..ఇక నేతలు.. ద్వితీయ శ్రేణి నేతలకు మాత్రం … ఎలా ధైర్యం ఉంటుంది.
జగన్ రెడ్డి తర్వాత వైసీపీలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి ఇప్పుడు నోరు తెరవడం లేదు. తెరిస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకే మౌనంగానే భయం భయంగానే ఉంటున్నారు. ఆయన పుంగనూరు పోవడం లేదు. విజయవాడలో ఉండటం లేదు. అవసరమొచ్చినప్పుడు జగన్ పక్కన కనబడుతున్నారు. ఆయన ప్రధాన అనుచరులంతా పరారీలో ఉన్నారు. జగన్ , పెద్దిరెడ్డి మాత్రమే కాదు.. ఐదేళ్ల పాటు నోరు చేసుకున్న పేర్ని నాని, కొడాలి నాని , జోగి రమేష్, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి సహా … గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ నేతలు ఎవరూ నోళ్లు తెరవడం లేదు. చాలా మంది ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడంలేదు. నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. ఇలా పదుల సంఖ్యలో నేతలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.
Also Read : ఎస్సీ వర్గీకరణపై ఇరుక్కుపోయిన వైసీపీ !
వైసీపీకి చెందిన కీలక నేతలు ఎందుకైనా మంచిదని ఆజ్ఞాతంలో ఉంటున్నారు. సన్నిహితులకూ అందుబాటులోకి రావడం లేదు. వీరిలో చాలా మందిని ప్రభుత్వం అనుకుంటే తక్షణం అరెస్టు చేసి తీసుకు రాగలదు. కానీ భయంతో బిక్కు బిక్కుమంటూ బతికేలా చేయడమే అతి పెద్ద శిక్ష. ప్రస్తుతం టీడీపీ అదే వ్యూహంతో ఉందనుకోవచ్చు. తర్వాత చట్టపరంగా తీసుకునే చర్యలకు ఆప్షన్స్ ఎలాగూ ఉంటాయి. అధినేత జగన్ కూడా… భయంతో ఏపీలో ఉండటానికి ధైర్యం చేయనప్పుడు కింది స్థాయి కార్యకర్తలు .. నేతలు మాత్రం ఎలా ధైర్యం చేయగలరు ?
వైసీపీకి ఈ దుస్థితికి కారణం అయిన సజ్జల కూడా తన ఉనికి పెద్దగా బయటకు కనిపించనీయడం లేదు. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ అయిన ఆయన కొడుకును ఆజ్ఞాతంలోకి పంపేశారు. ఆయన జగన్ వచ్చినప్పుడు విజయవాడకు వస్తున్నారు. మిగతా రోజుల్లో హైదరాబాద్ లో ఉంటున్నారు. మొత్తంగా వైసీపీ.. భయం భయంగా గడుపుతోంది.