బెల్లంకొండ శ్రీనివాస్ – నారా రోహిత్ – మంచు మనోజ్ కాంబోతో ఓ సినిమా రాబోతోంది. ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రానికి శ్రీకారం చుడతారు. అయితే ఇదో రీమేక్ కథ అని తెలుస్తోంది. తమిళంలో మంచి విజయాన్ని అందుకొన్న ‘గరుడన్’ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారని టాక్. టైటిల్ కూడా ‘గరుడ’ గా ఫిక్స్ చేశార్ట. దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన కథ ‘గరుడన్’. ఈ చిత్రానికి వెట్రిమారన్ కథ అందించడమే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరించారు.
Also Read : బెల్లంకొండ – మనోజ్ – నారా రోహిత్.. ఓ మల్టీస్టారర్
ముగ్గురు స్నేహితుల కథ ‘గరుడన్’. ఇందులో ప్రతీకారం అనే పాయింట్ కూడా ఉంది. ఎవరు ఎవరిపై ఎందుకు ప్రతీకారం తీర్చుకొన్నారన్నదే ఆసక్తికరం. తమిళంలో సూరి, ఉన్నిముకుందన్, శశికుమార్ నటించారు. ఈ పాత్రల్లో బెల్లంకొండ, నారా రోహిత్, మనోజ్ నటిస్తారు. మనోజ్ పాత్రలో నెగిటీవ్ ఛాయలు ఉంటాయని సమాచారం. తమిళంలో చాలా ‘రా’ ఉండే సినిమా ఇది. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులు చేశారు. త్వరలోనే టైటిల్ తో పాటుగా మిగిలిన వివరాలు వెల్లడిస్తారు.