తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోందా? ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – బీజేపీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరుగుతోందా..? కీలక నేతలతోపాటు ఎమ్మెల్యేలను కూడా పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు కిషన్ రెడ్డి అనాసక్తి చూపుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి – ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఆహ్వానం ఇవ్వకపోవడం.. అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి అన్న దానిపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ముందుగానే సమావేశమై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తాయి. ఏయే అంశాలపై మాట్లాడాలో ఎమ్మెల్యేలకు సూచనలు చేసి..పూర్తి సబ్జెక్ట్ ను అందిస్తాయి. కానీ, బీజేపీలో మాత్రం ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి.
Also Read : డ్యామిట్…దానం బిగ్ మిస్టేక్.. అయినా!
బీజేపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎనిమిది మందిలో ఆరుగురు కొత్తవారే..ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ మాత్రమే సీనియర్లు. అయినా కొత్తవారికి ఏయే అంశాలపై మాట్లాడాలో సూచనలు చేయకపోవడం పట్ల పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని వాదనలు వినిపించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు కావాల్సిన సబ్జెక్ట్ ను రాష్ట్ర నాయకత్వమే సమకూర్చగా.. బీజేపీ నాయకత్వం మాత్రం తమకు ఏమి పట్టనట్లు వ్యవహరించినట్లుగా టాక్ నడుస్తోంది.
పార్టీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కూడా కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇటీవల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదని..ఇందుకు సంబంధించి రూపొందించిన పోస్టర్ లో మహేశ్వర్ రెడ్డి ఫోటో లేకపోవడం చర్చనీయాంశం అయింది. కేవలం నడ్డా, కిషన్ రెడ్డి ఫోటోలు మాత్రమే పెట్టడం ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణమైంది.
కిషన్ రెడ్డి కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తుండటం..తొందర్లోనే కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందన్న ఆలోచనతోనే మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ లు రాష్ట్ర నాయకత్వంపై మౌనం వహిస్తున్నారని అంటున్నారు.