టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకూ 4 వేయి కోట్ల సినిమాలొచ్చాయి. బాహుబలి రెండు భాగాలూ వెయ్యి కోట్ల మైలు రాయిని అందుకొన్నాయి. ఆర్.ఆర్.ఆర్ కూడా ఈ మ్యాజిక్ ఫిగర్ దాటింది. `కల్కి` కూడా వెయ్యి కోట్ల ఘనత అందుకొంది. అయితే పక్కనే ఉన్న తమిళ సీమకు మాత్రం ఇదో అందని ద్రాక్షే అయ్యింది. రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్లు ఉన్నారక్కడ. కానీ ఎవరికీ ఈ మ్యాజిక్ సాధ్యం కాలేదు. రజనీ ఫామ్ లో లేకపోవడం పెద్ద లోటు. విజయ్ సినిమాలు సైతం, ఈ వెయ్యి కోట్ల మ్యాజిక్ ఫిగర్‌కు చేరువ కాలేకపోయాయి. ‘భారతీయుడు 2’తో కమల్ ఈ ఫీట్ చేరుకొంటాడని తమిళ చిత్రసీమ ఆశలు పెట్టుకొంది. కానీ అది డిజాస్టర్ గా మారిపోయింది. విజయ్ చేస్తున్న ‘గోట్’పై ఇప్పుడు వాళ్లు దృష్టి సారించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు చేస్తున్న చివరి సినిమా ఇది. కాబట్టి హైప్ మామూలుగా ఉండదు. కానీ వంద కోట్లు అనేది తమిళ చిత్రసీమకు ఇప్పటికీ చాలా పెద్ద మాటే. ఎందుకంటే.. వెయ్యి కోట్ల మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే హిందీ మార్కెట్ ని గట్టిగా పట్టుకోవాలి. అక్కడ తెలుగు సినిమాలకు ఉన్నంత క్రేజ్ తమిళ చిత్రాలకు లేదు. అందుకే విజయ్, రజనీకాంత్ పప్పులు ఉడకడం లేదు.
అయితే సూర్య మాత్రం వెయ్యి కోట్లపై కన్నేశాడు. తన కొత్త సినిమా ‘కంగువ’ ఈ యేడాదే విడుదల కాబోతోంది. ఈ సినిమాపై దాదాపుగా రూ.350 కోట్లు ఖర్చు పెట్టారు. సూర్య మార్కెట్ తో పోలిస్తే… బడ్జెట్ చాలా ఎక్కువ. ఆ డబ్బు రాబట్టుకోవాలంటే పాన్ ఇండియా స్థాయిలో విస్త్రృతంగా ఈ సినిమా ఆడాలి. అందుకే బాలీవుడ్ మార్కెట్ పై చిత్రబృందం ప్రత్యేకమైన దృష్టి సారించింది. విజువల్ పరంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుందని, బాలీవుడ్ కూ నచ్చుతుందని, వాళ్లకు నచ్చితే రూ.1000 కోట్లు కొల్లగొట్టడం అంత కష్టమేం కాదని ‘కంగువ’ టీమ్ చెబుతోంది. సూర్య సినిమాలు గతంలోనూ హిందీలో రిలీజ్ అయ్యాయి. కానీ ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. బాబీ డియోల్ మినహాయిస్తే బాలీవుడ్ స్టార్లెవరూ ఈ సినిమాలో లేరు. అలాంటప్పుడు రూ.1000 కోట్లు సాధించడం అత్యాసే అన్నది తమిళ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్, కమల్, రజనీ వల్ల కానిది సూర్య వల్ల ఏం అవుతుంది? అనేదే వాళ్ల ప్రశ్న. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.