బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని లేదంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చకపోతే పరిణామాలు సీరియస్ గా ఉంటాయని హెచ్చరించారు.
శనివారం నల్గొండ జిల్లా మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. నేను అమెరికా వెళ్తున్నా..ఈ నెల పదకొండో తేదీన తిరిగి వస్తాను.. అప్పటిలోపు బీఆర్ఎస్ కార్యాలయాన్ని నేలమట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి నెల రోజులు అవుతున్నా తన మాటలను ఖాతరు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : కేటీఆర్ అభాసుపాలు!
జులైలో నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకరంలో పాల్గొన్న మంత్రి అప్పట్లోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేయాలని ఆదేశించారు. పేదలు ఇల్లు కట్టుకుంటే అధికారులు ఊరుకోరని.. బీఆర్ఎస్ నిబంధనలకు విరుద్దంగా పార్టీ ఆఫీసు నిర్మిస్తే ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కోట్ల విలువైన స్థలాన్నికబ్జా చేసి పార్టీ ఆఫీసును నిర్మించారని ఆరోపించారు.
తాజాగా జిల్లా కేంద్రంలో పర్యటించిన వెంకట్ రెడ్డి ..గులాబీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించడమే కాకుండా..ఇందుకోసం డెడ్ లైన్ కూడా విధించడంతో త్వరలోనే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది.