విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంపై మరోసారి విచారణ ప్రారంభించడం.. ఆ కేసులో జైల్లో ఉన్న హేమంత్ ను ఓ పోలీసు ఉన్నతాధికారి కలిసి గంటన్నర పాటు వివరాలు సేకరించడంతో ఎంవీవీ ఉలిక్కి పడ్డారు. ఎక్కడున్నారో తెలియని ఆయన వైజాగ్ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారు. తన కుటుంబం కిడ్నాప్ అయితే సానుభూతి చూపించకుండా దాని వెనుక ఏదో ఉందని నిందలేస్తున్నారని వాపోయారు. పునర్విచారణ చేసుకోవచ్చని కూడా సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా చేసేది ..,జరగాల్సింది పోలీసులు చూసుకుంటారు. కానీ జైల్లో ఉన్న హేమంత్ బయటపెడుతున్న విషయాలు చూస్తే.. ఎంవీవీ ఏకంగా మాఫియానే నడిపారన్న అనుమానాలు వస్తున్నాయి.
హేమంత్ పేరుతో ఓ లేఖ జైలు నుంచి బయటకు వచ్చింది. అందులో హేమంత్ తనను వాడుకున్న వైనాన్ని… ఎంవీవీ చేసిన సెటిల్మెంట్స్.. అందులో తన పాత్ర గురించి వివరించారు. ఓ మాజీ చీఫ్ సెక్రటరీ అసైన్డ్ ల్యాండ్స్ ను ఎలా కొట్టేశాడో కూడా అందులో వివరించారు. ఎంవీవీ గత ఐదేళ్ల కాలంలో చేసిన భూదందాలపైనా సంచలన విషయాలు వెల్లడించారు. ఈ లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖపై హేమంత్ సంతకం లేదని ఎంవీవీ అంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలని అంటున్నారు.
నిజనికి ఇప్పటికే ఐదేళ్లుగా జరిగిన భూదందాలు.. అందులో వైసీపీ నేతలు చేసిన సెటిల్మెంట్ల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో యంత్రాగం ఉంది. రేపో మాపో అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది. కానీఓ ముఠా ఎంవీవీ నేతృత్వంలో…మరో ముఠా విజయసాయి నేతృత్వంలో దందాలు చేశాయి. అందుకే వారి మధ్య విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఎంవీవీ కుటుంబ కిడ్నాప్ కేంద్రంగా…అసలు మాఫియా గురించి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.