ఎలాగోలా అమెరికా చేరుకుంటే ఏదో ఒక ఉద్యోగం ఖాయం.. డాలర్ల వర్షం ఖాయమని అనుకునే పరిస్థితికి కాలం చెల్లింది. ఇప్పుడు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వారికి కూడా ఉద్యోగాలు దొరకడం దుర్లభం అవుతోంది. వెల్లువలా ఇతర దేశాల నుంచి అమెరికా వస్తున్న వారు.. చదువు అయిపోయిన తరవాత కూడా ఉద్యోగం పొందడానికి అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. చదువు తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. భారత్ నుంచి లక్షల్లో విద్యార్థులు చదువుల పేరుతో అమెరికాకు వెళ్తున్నారు. వారి టార్గెట్ అక్కడ స్థిరపడటమే. కానీ గతంలోలా ఇప్పుడు సానుకూల పరిస్థితులులేవు.
అమెరికాలో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో నిరుద్యోగం 4.3శాతానికి పెరిగింది. 2021 అక్టోబరుతో పోలిస్తే ఇదే అత్యధికం. గత కొన్ని నెలలుగా ఇది పెరుగుతూనే ఉంది. ఇప్పుడల్లా ఉద్యోగాల సృష్టి ఓ విప్లవంలా జరిగే అవకాశం లేదన్న సంకేతాలు వస్తున్నాయి. అమెరికాలో ఎంఎస్ చదవడానికి వచ్చే వాళ్లు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని ఇప్పటికే అక్కడ కు వెళ్లి కష్టాలు పడుతున్న వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా అమెరికా వచ్చే వారితో వీసా స్కాములు చేసేందుకు కొంత మంది రెడీగా ఉండటం.. వారితో శ్రమదోపిడీ చేయించుకోవడం సాధరాణంగా మారింది. తాజాగా కంది శ్రీనివాసరెడ్డి అనే ఎన్నారై చేసిన స్కాం అమెరికాలో సంచలనంగా మారింది. ఇలాంటివి వరుసగా బయటపడుతున్నాయి.
అమెరికాలో ఇప్పుడు గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితులు లేవు. వచ్చే నాలుగేళ్లు ఇంకా గడ్డు కాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజంగా చదువు కోసమే వస్తే.. పర్వా లేదు కానీ.. చదువు అయిపోయేలోపు అక్కడే ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడాలనుకుంటే మాత్రం… చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదృష్టం కూడా కలసి రావాల్సి ఉంటుంది. అయితే అమెరికా ఆశలు మాత్రం… భారతీయుల్లో తగ్గడం లేదు. లక్షల మంది ప్రతి ఏటా అమెరికా పయనమవుతూనే ఉన్నారు.