బీఎల్ సంతోష్..పేరు గుర్తుండే ఉంటుంది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సమయంలో ప్రముఖంగా వినిపించిన పేరు. బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహిత నేత అయిన ఈ బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని చూసి కేసీఆర్ తీవ్రంగా నష్టపోవడమే కాకుండా, రాజకీయంగా కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అయింది..ఇప్పుడు బీఎల్ సంతోష్ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో బీజేపీకి మంచి ఆదరణ ఉందని.. కష్టపడి పని చేస్తే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ బేలగా మారుతోన్న సమయంలో రాష్ట్ర రాజకీయాలపై బీఎల్ సంతోష్ ఫోకస్ పెట్టడం గులాబీ పార్టీలో కలవరం రేపుతోంది. అసలే గులాబీ నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. బీజేపీ ట్రబుల్ షూటర్ గా పేరు గాంచిన బీఎల్ సంతోష్ చూపు ఇప్పుడు తెలంగాణపై కేంద్రీకరించడంతో..ఎలాంటి మార్పులు ఉంటాయో కానీ, బీఆర్ఎస్ కు మాత్రం పెద్ద టెన్షన్ పట్టుకుంది.
కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆసక్తి లేని బీఆర్ఎస్ నేతలను బీఎల్ సంతోష్ బీజేపీలోకి తీసుకొస్తారు.. ఆ దిశగా సంప్రదింపులు కూడా జరుపుతారని అంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ బాస్ కేసీఆర్.. బీఎల్ సంతోష్ ను అడ్డుకోవడం సవాల్ తో కూడుకున్నదే. ఇదే బీఆర్ఎస్ ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ఈ టాస్క్ ను కేసీఆర్ ఎలా నిర్వీర్యం చేయబోతున్నారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.