రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. సీఎంతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు అధికారికంగా అమెరికా పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నారు. అయితే, ఆయన టూర్ అధికారికమా? జర్నలిస్టులతో కలిసి ఆస్ట్రేలియా పోయారన్నది నిజమేనా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కొండల్ రెడ్డి టూర్ ను ప్రశ్నిస్తూ పలు పోస్టులు పెట్టడంతో… చర్చనీయాంశం అవుతుండగా, నిజంగానే ఇది అధికారిక పర్యటనా? వ్యక్తిగత పర్యటనా? ఇది కుటుంబ పాలన కాదా అంటూ రాజకీయంగా విమర్శలు-ప్రతి విమర్శలు మొదలయ్యాయి.
ఇందులో నిజానిజాలను తెలుసుకుంటే… సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నది నిజమే కానీ అది వ్యక్తిగత పర్యటనగా తెలిసింది. ఆస్ట్రేలియాలో ఉన్న తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ లాండ్ సంస్థ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారు ఏర్పాటు చేసిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ లాండ్ వారి పదేండ్ల పండుగకు ఆయనకు ఆహ్వానం రావటంతో ఆ సభకు వెళ్లారు. అదే సమయంలో కొందరు జర్నలిస్టులతో పాటు వరంగల్ జిల్లా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా ఆహ్వానం రావటంతో ఆయన కూడా వెళ్లారు. ఆ మీటింగ్ కు స్థానిక ఎంపీ, బ్రిస్బేన్ మేయర్ కూడా హజరయ్యారు. వారి ఆహ్వానం మేరకు అక్కడున్న పార్లమెంట్ హౌజ్ ను సందర్శించినట్లు తెలిసింది. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగానే సాగుతోంది.