మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైల్స్ దహనం కేసులో డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. లోతైన విచారణ కోసం ఈ కేసును సీఐడీకి అప్పగించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం కనిపిస్తోంది.
గత నెల 21న రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలలో ఫైల్స్ దహనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు తొమ్మిది కేసులు నమోదు చేశారు. ఉద్యోగులు, నేతలపై కూడా కేసులు నమోదు అయ్యాయి.ఘటన జరిగిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవ్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : పెద్దిరెడ్డిపై అనర్హత వేటు కత్తి వేలాడుతుందా?
అయితే, ఈ కేసులో అన్ని వేలు పెద్దిరెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఆయనకు సంబందించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైల్స్ అక్కడే ఉండటం..నిషేధిత భూముల జాబితా సెక్షన్ లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డికి ఇబ్బందులు తప్పవన్న ప్రచారం జరుగుతుండగానే ఈ కేసును సీఐడీకి అప్పగించడం..ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నపెద్దిరెడ్డికి మరిన్ని చిక్కులు తప్పవన్న టాక్ నడుస్తోంది. సీఐడీకి కేసును అప్పగించడంతో లోతైన విచారణ ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి రానుండగా.. పెద్దిరెడ్డి కోటరీలో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది.