తెలుగు పాటల్లో ఫోక్ టచ్ ఈమధ్య బాగా వినిపిస్తోంది. ఇలాంటి పాటలు రాయడంలో సుద్దాల అశోక్ తేజ కలం పరుగులు పెడుతుంటుంది. ‘ఫిదా’లో ‘సారంగ దరియా’ ఎంత హిట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తరవాత ఆ స్థాయిలో సుద్దాల పాటేదీ వినిపించలేదు. ఇంతకాలానికి సుద్దాల మార్క్ పాటొకటి వచ్చింది. ‘మెకానిక్ రాకీ’ ద్వారా.
విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. మీనాక్షీ చౌదరి కథానాయిక. రవితేజ దర్శకుడు. ఈ సినిమా నుంచి ‘గుల్లెడు… గుల్లెడు’ అనే పాట ఒకటి ఈరోజు విడుదల చేశారు. ఫోక్ బీట్ లో సాగిన ట్యూన్ ఇది. మంగ్లీ ఎప్పటిలా హుషారుగా పాడారు. ఆమె పాడుతుంటే ‘సారంగ దరియా’ వైబ్స్ గుర్తొచ్చాయి. ఆ పాట కూడా మంగ్లీ – సుద్దాల కాంబోలో వచ్చిందే. సుద్దాల కలం చాలా చోట్ల బాగా మెరిసింది. ఖలాసైతిని.. కల్లు గళాసైతిని అన్నది మంచి హుక్ లైన్. దాన్ని పాట మొత్తం బాగా వాడుకొన్నారు. నృత్య దర్శకుడు యశ్ పాటకు తగ్గట్టుగా మాసీ స్టెప్పులు వేయించాడు. సంగీత్ నేపథ్యంలో వచ్చే పాటలా కనిపిస్తోంది. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించారు. అక్టోబరు 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మాస్, యాక్షన్‌కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. ‘గుల్లెడు..’ పాట జనంలోకి వెళ్లినట్టే. ఈ ఆల్బమ్ నుంచి మరో మంచి పాట వస్తే – అది మరింత ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.