చేనేతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేతకు ప్రయత్నిస్తామని , కుదరకపోతే రియింబర్స్ మెంట్ విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు చారిత్రక నేపథ్యం ఉందని గుర్తు చేశారు.స్వాతంత్ర్య ఉద్యమంలో 7వ తేదీనే చేనేత ఉద్యమం మొదలు అయిందని చెప్పారు. నేతన్నల జీవితాలను బాగుచేసే వరకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
టీడీపీ హయాంలో చేనేత రంగాన్ని ఆదుకున్నాం. కానీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో చేనేత రంగం సంక్షోభంలోకి వెళ్లిందని చెప్పారు. నేతన్న హస్తం పేరుతో వాళ్లకు ఇచ్చే అన్ని పథకాలను వైసీపీ రద్దు చేసింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు నిలిపివేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నేతన్నల కోసం టీడీపీ కృషి చేసిందని చంద్రబాబు చెప్పారు.
చేనేతలకు ఇచ్చే అన్ని రుణాలను వైసీపీ రద్దు చేసింది. నేత కార్మికులకు 226కోట్ల బకాయిలు ఉంచారు. కాంగ్రెస్ హయాంలో నేతన్నల తరఫున పోరాటం చేసి రుణమాఫీ చేయించాం..టీడీపీ అధికారంలోకి వచ్చాక నేతన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి.. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించామన్నారు చంద్రబాబు.
ఆదరణ పథకం కింద చేనేత కార్మికులకు పరికరాలు అందించాం. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలబడింది బీసీలు. బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతాం. స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తీసుకొస్తాం. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. ఈసారి బీసీ సబ్ ప్లాన్ కోసం ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు కేటాయిస్తాం. అట్టడుగు కులాలను అభివృద్ధిలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.