పేరు, పాపులారిటీ సంపాదించుకోవడానికి వెండి తెర, బుల్లి తెర అనే తేడా లేదు. టాలెంట్ ఉంటే, ఎక్కడైనా స్టార్లుగా వెలగొచ్చు. అలా బుల్లితెరపై తమ ప్రభావం చూపించారు సుమ, బిత్తిరి సత్తి. అయితే ఇప్పుడు వీరిద్దరూ వేర్వేరు కారణాల వల్ల వార్తలకెక్కారు.
రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన యాడ్స్ లో బుల్లి తెర స్టార్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. సుమ కూడా అలానే ఓ యాడ్ చేసింది. అయితే.. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఇప్పుడు చేతులు ఎత్తేసింది. ఫ్లాట్లు కొన్నవారికి మొహం చాటేసింది. దాంతో రూపాయి రూపాయి కూడ బెట్టుకొని ఫ్లాట్లు కొన్నవాళ్లంతా రోడ్లెక్కారు. ”సుమ ప్రమోట్ చేసిందని ఫ్లాట్లు కొన్నాం. ఇప్పుడు మా బతుకులు రోడ్డుమీదకు వచ్చాయి” అంటూ బాధితులు మీడియా ముందుకొచ్చారు. దీనిపై సుమ స్పందించాల్సివచ్చింది. తాను రియల్ ఎస్టేట్ యాడ్‌లో నటించిన మాట వాస్తవమే అని, అయితే ఆ ఎగ్రిమెంట్ ఎప్పుడో ముగిసిందని, ఇప్పుడు తనకూ ఆ సంస్థకూ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇలాంటి ప్రకటనల్లో నటించేటప్పుడు స్టార్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్భాటాలు చేసి, సామాన్యుల దగ్గర డబ్బులు దండుకొని, బోర్డులు తిప్పేసే రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా ఉన్నాయి. వాటి నుంచి అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉంది. సెలబ్రెటీలు నటించారు కదా అని దాన్నే గుడ్ విల్ గా భావించి గుడ్డిగా ఫ్లాట్లు కొనేస్తుంటారు చాలామంది. అందుకు ఈ ఉదంతమే ఓ సాక్ష్యం.
బిత్తిరి సత్తిది మరో కేసు. ఫ్రెండ్ షిప్ డేని పురస్కరించుకొని ఓ భగవద్గీత శ్లోకాన్ని పాడుతూ, దాని అర్థాన్ని వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు బిత్తిరి సత్తి. దానిపట్ల హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం చెప్పాయి. ఈ విషయంలో కాస్త గలాటా కూడా జరిగింది. హిందువులకు బిత్తిరి సత్తి క్షమాపణులు చెప్పాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. కానీ బిత్తిరి సత్తి జంకలేదు. దాంతో ఇప్పుడు హిందూ సంఘాలు బిత్తిరిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాయి. దీనిపై ఇప్పుడు బిత్తిరి సత్తి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.