బీఆర్ఎస్ లో రాజ్యసభ ఎంపీగా ఉంటూ కాంగ్రెస్లో చేరి పదవికి రాజీనామా చేసిన కేకే సలహాదారుగా పదవి పొందారు. అయితే ఇప్పుడు ఆయన ఖాళీ చేసిన స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ప్రత్యామ్నాయంగా పదవి వచ్చినందున కేకేకు ఆ సీటు ఇవ్వకపోవచ్చు. కానీ గట్టిగా మూడేళ్ల పదవి కాలం లేని ఆ హాఫ్ రాజ్యసభ సీటు కాంగ్రెస్లో పెద్ద చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది.
కేకే ఖాళీ చేసిన రాజ్యసభ సీటు తనకు ఇవ్వాలని ఇప్పటికే వీ హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసినంత పని చేశారు. ఆయన మాత్రమే కాదు గుట్టుగా తమ ప్రయత్నాలు చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. జానారెడ్డి నుంచి చిన్నారెడ్డి వరకూ పదవి కాలం ఎంత ఉందన్నది ముఖ్యం కాదు.. ఓ సారి పదవి దక్కించుకుంటే మరోసారి కంటిన్యూషన్కు చాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే ఈ ఒక్క సీటు అదీ కూడా సగం పదవి కాలం ఉన్న సీటు .. కాంగ్రెస్లో పెద్ద సమరానికి కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
దేశంలో మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకూ నామినేషన్ల స్వీకరిస్తారు. పోలింగ్ అవసరం అయితే సెప్టెంబరు 3న నిర్వహిస్తారు.ఈ పన్నెండు స్థానాల్లో 10 మంది గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడం వల్ల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మిగతా ఇద్దరూ తర్వాత రాజీనామా చేశారు. వీరిలో ఒకరు కేకే కాంగ్రెస్లో చేరగా.. మరో ఒడిషా బీజేడీ ఎంపీ .. బీజేపీలో చేరి రాజీనామా చేశారు.