సెప్టెంబరు 1తో నందమూరి బాలకృష్ణ నట ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా తెలుగు చిత్రసీమ ఆయన్ని ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకొంది. ఈమధ్య కాలంలో టాలీవుడ్ అంతా ఏకమై నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి సర్వత్రా ఆసక్తి నెలకొంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నారు. బాలయ్య లాంటి నటుడ్ని గౌరవించుకోవడం అదృష్టమని, ఈ వేడుకను దయచేసి కాంట్రవర్సీ చేయొద్దని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా కోరారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చిత్రసీమ మొత్తం ఎదురు చూస్తోందని, ఆహ్వానాల ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, అయితే ఫలానా హీరో వచ్చాడు, ఫలానా హీరో రాలేదంటూ కొత్త కాంట్రవర్సీలు లేవనెత్తొద్దని, ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్లు వస్తారని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.
Also read : బాలయ్య ఫ్యాన్స్…. గెట్ రెడీ!
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తాడా, రాడా? అంటూ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైపోయింది. బాలయ్యకు, ఎన్టీఆర్‌కూ మధ్య సత్సంబంధాలు లేవు. టీడీపీకి సైతం ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు బాలయ్య 50 ఏళ్ల పండుగకూ ఎన్టీఆర్ వచ్చే అవకాశం లేదు. ఎన్టీఆర్ రాకపోతే… చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం మొదలెడతారు. ఎన్టీఆర్ అనే కాదు, ఇండస్ట్రీలోని ఏ పెద్ద హీరో హాజరు కాకపోయినా చర్చంతా దాని చుట్టూనే నడుస్తుంది. అందుకే ముందే… ఈ చర్చకు పుల్ స్టాప్ పెట్టాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు.