హరీష్ శంకర్‌ది డిఫరెంట్ స్టైల్. ఏదీ మనసులో ఉంచుకోడు. ఎక్కడికక్కడ కక్కేస్తాడు. తనపై రూమర్లు రాస్తున్న ఓ వెబ్ సైట్ నీ, సదరు జర్నలిస్టుని ట్వీట్లతో ఉతికి ఆరేస్తుంటాడు. ఇప్పుడు తన సినిమా ట్రైలర్లోనూ ఆ రాతలపై తన మార్క్ సెటైర్ ఒకటి వదిలాడు.
రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ బయటకు వచ్చింది. రవితేజ మార్క్… ట్రైలర్ కట్ ఇది. రవితేజ సినిమాల నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అవన్నీ ఇందులో మిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ లో హిట్టయిన ‘రైడ్’ చిత్రానికి రీమేక్ ఇది. అయితే హరీష్ శైలి మార్పులూ – చేర్పులూ తోడయినట్టు ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. రవితేజ హీరోయిజం, స్టైలింగ్, హరీష్ మార్క్ ఎంటర్టైన్మెంట్, వన్ లైనర్లు మిక్సయ్యాయి. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ని ఇండియన్ ఆర్మీతో పోల్చడం బాగుంది. పాత సినిమాలు, పాటలకు సంబంధించిన రిఫరెన్సులు కనిపించాయి. ముఖ్యంగా 1980 నాటి టేప్రికార్డర్లు, క్యాసెట్లు చూపించి వింటేజ్ లుక్ తీసుకొచ్చాడు హరీష్.
చివర్లో ఓ డైలాగ్ పేలింది. ”పనీ పాటా లేని చాలామంది పకోడీగాళ్లు ఇదే పనిమీద ఉంటారు” అంటూ పరోక్షంగా గాపిప్ వెబ్ సైట్ కు చురకలు అంటించాడు.
ఇటు హరీష్ అటు రవితేజ ఇద్దరూ అమితాబ్ అభిమానులే. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ అని ఆయన పేరు పెట్టారు. ‘షోలే’ ఆగస్టు 15న విడుదలైంది. ఆ విషయాన్ని కూడా ఈ ట్రైలర్ లో గుర్తు చేయడం విశేషం.