రెండు లక్షల రైతు రుణమాఫీపై ఆదిలో నోరు మెదిపిన బీఆర్ఎస్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. రైతు బంధు నిధులను రుణమాఫీ కోసం డైవర్ట్ చేశారని ఆరోపణలు చేసినా రైతాంగం నుంచి ఆశించిన స్పందన లేకపోవడం.. రుణమాఫీతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుండటంతో ఈ అంశంపై సర్కార్ ను టార్గెట్ చేయడం ఏమంత మంచిది కాదని బీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
రైతు రుణమాఫీకి మొదటి విడత నిధుల ప్రక్రియ ప్రారంభం కాగానే సర్కార్ ను బీఆర్ఎస్ ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలనుకుంది. రైతు భరోసా ఇవ్వకుండా కేవలం రుణమాఫీ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని..రైతులు ఈ మోసాన్ని గుర్తించాలని బీఆర్ఎస్ అప్పీల్ చేసింది. అయినా రైతులు ఏదో ఒక ప్రయోజనం జరుగుతుంది కదా.. తొందర్లోనే ఈ రైతు భరోసా నిధులనూ జమ చేస్తారు అనే నమ్మకంతో బీఆర్ఎస్ వాదనలను పట్టించుకోలేదు.
Also Read : కవితను బయటకు తీయటమే బీఆర్ఎస్ ఫస్ట్ ప్రియారిటీ!!
మరోవైపు..గడువులోగా రైతు రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్దమని సవాల్ చేసి..సర్కార్ దూకుడుతో హరీష్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. రేవంత్ హామీ ఇచ్చినట్టుగానే గడువులోగా రుణమాఫీ చేసి చూపించారు..హరీష్ రావు రాజీనామాకు సిద్దమా అంటూ కాంగ్రెస్ నేతల ప్రశ్నలు జనాల్లోకి బాగా వెళ్ళాయి. పైగా..మొదట రైతు భరోసా నిధుల చెల్లింపు తర్వాతే రుణమాఫీ చేయాలనే తరహాలో కేటీఆర్ , హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపణలతో రైతులు బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఈ విషయంలో బీఆర్ఎస్ స్పందన తొందరపాటు చర్యగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అనేది అంతా ఈజీ కాదు. అయినా.. రేవంత్ సర్కార్ చేసి చూపించింది. దీంతో ఈ అంశంపై ఎలా స్పందించినా కాంగ్రెస్ కు ఫేవర్ చేసినట్లుగానే అవుతుంది తప్ప బీఆర్ఎస్ కు ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదనే లెక్కతోనే బీఆర్ఎస్ ఈ అంశంపై పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది.