అక్కినేని కుటుంబానికి తొలి పెళ్లి అచ్చురాలేదేమో..? నాగార్జునది రెండో పెళ్లే. సుమంత్ పెళ్లి కూడా మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. సుప్రియకు కూడా పెళ్లి కలసి రాలేదు. నాగచైతన్య విషయంలోనూ అదే జరిగింది. సమంతని ప్రేమించి, ఇంట్లో పోరాడి, వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకొన్నాడు. ఆ సంసార జీవితం కొన్నాళ్లు హాయిగానే సాగింది. కానీ అంతలోనే బీటలు వారింది. ఇద్దరూ విడిపోయారు. కట్ చేస్తే… చైతూ ఇప్పుడు శోభితతో నిశ్చితార్థం జరుపుకొన్నాడు. రేపో.. మాపో… అక్కినేని ఇంట్లో మళ్లీ పెళ్లి బాజాలు మోగుతాయి. మరి సమంత మాటేమిటి? సమంత కూడా మరో పెళ్లి చేసుకొంటుందా?
పెళ్లి మాట అటుంచితే… చైతూ రెండో పెళ్లిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారిందిప్పుడు. సమంత తన భావోద్వేగాల్ని ఏనాడూ అదుపులో పెట్టుకోవాలని చూడలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన ఫీలింగ్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకొంటూనే ఉంటుంది. సమంత ఓ పోస్ట్ పెడితే… అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చైతూని గుర్తు చేసేలా ఉంటుందని ఆమె అభిమానులు చెబుతుంటారు. కొన్ని కోట్స్ నర్మగర్భంగా పెడుతూ.. తన ఫీలింగ్స్ లో షేర్ చేసుకొంటుంది. మరి ఈసారి సమంత ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. చై-సమంత విడిపోయిన తరవాత కనీసం సినిమా వేడుకల్లో కూడా ఎదురుపడలేదు. ఒకరి గురించి ఒకరు నేరుగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరి జీవితం వాళ్లదే అన్నట్టు కొత్త మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టారు. మరి ఇప్పుడు కూడా సమంత అలానే ఉంటుందా? ఇది సున్నితమైన విషయం కాబట్టి దాని జోలికి వెళ్లకుండా హుందాగా ప్రవర్తిస్తుందా? లేదంటే… చైతూని ఉద్దేశించి ఏమైనా మాట్లాడుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చైతో విడిపోయిన తరవాత సమంత మానసికంగా మరింత ధృడంగా మారిందని, చై ఎప్పటికైనా మరొకర్ని పెళ్లి చేసుకొంటాడనే విషయంలో మానసికంగా ముందే సిద్ధమైందని, కాబట్టి సమంతకు ఇదేం షాకింగ్ విషయం కాదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.