భూముల అంశంలో, రెవెన్యూ నిర్ణయాల్లో జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒక్కొక్కటిగా చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది కూటమి సర్కార్. ఇప్పటికే కొత్త పట్టాదారు పాస్ పుసక్తాలను ఇవ్వాలని నిర్ణయించగా… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టబోతున్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు కొత్తగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేకపోగా… అవినీతికి ఆస్కారం ఉండటంతో పాటు అతి తక్కువ రెస్పాన్స్ ఉన్నందున పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు.
అయితే, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని, వెంటనే 10కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక, ఏపీలో బహిరంగ మార్కెట్ కు… ప్రభుత్వ నిర్దేశిత భూ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో మార్కెట్ విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాంతాల వారీగా శాస్త్రీయంగా అంచనా వేసి… ఏ ప్రాంతాల్లో ఎంత పెంచాలి, ఎక్కడ ఎంత మేర ఉంది అన్న వివరాలను ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక ఇవ్వనుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం 10-20శాతం రిజిస్ట్రేషన్ విలువలను పెంచే అవకాశం ఉంది.