కర్ణాటక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం సెగలు రేపుతోంది. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాలంటే.. నువ్వు తప్పుకోవాలంటూ ఇద్దరూ తగ్గేదేలే అంటూ డైలాగ్ లు పేల్చుతున్నారు. దీంతో ఒక్కసారిగా కర్ణాటక పాలిటిక్స్ సెగలు కక్కుతున్నాయి.
17ఏళ్ల బాలికపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నమోదైన ఫోక్సో కేసులో ఆయన నిందితుడిగా ఉండటంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఇలాంటి నేతలకు చోటు ఉండకూడదన్నారు. సిద్దరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలకు యడియూరప్ప ధీటుగా బదులిచ్చారు. ఎందుకు తొందరపడుతున్నారు.. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరిస్తుంది.. ఆ తర్వాత రాజకీయాల నుంచి ఎవరు రిటైర్ అవుతారో చూసుకుందామన్నారు.
అలాగే, మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ ( ముడా ) అథారిటీ కుంభకోణాన్ని ప్రస్తావించారు యడియూరప్ప. ముడా నుంచి సిద్దరామయ్య భార్య అక్రమంగా పరిహారం పొందారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశాన్ని ముందుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
దీంతో ఈ విషయాన్నిలేవనెత్తిన యడియూరప్ప.. పదవి విరమణ చేసి ఇంటికి వెళ్లే సమయం సమీపిస్తుంది గుర్తుంచుకో అంటూ సిద్దరామయ్యకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు.