భారత కుటుంబ వ్యవస్థలో భర్త అడుగు జాడల్లో నడిచే భార్యలను చూశాను… తన కుటుంబంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ప్రాణంగా చూసుకున్న కుటుంబ సభ్యులే తనపై దాడి చేస్తున్నారంటూ వాపోయారు. ఎన్ని కష్టాలు , నష్టాలు ఎదురైనా వాటిని కుటుంబం దాకా చేరకుండా భరించానని కానీ, తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
ఎంత బాగా చూసుకున్నా తన భార్య వాణి గొడవలు చేసేదని, వ్యాపార సంస్థలను ,మైన్స్ లను తన పేరిట రాయలంటూ గొడవకు దిగేదని ఆరోపించారు. తండ్రిని నిలదీసేలా పిల్లల్లో కూడా విషం నింపిందన్నారు. ప్రతి కుటుంబంలో గొడవలు కామన్ అని, వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని కానీ, తన భార్య వాణి మాత్రం రాజకీయ ఆకాంక్షతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగుతుందని ఆరోపించారు.
వాణికి టెక్కలి టికెట్ కావాలంటూ జగన్ ను కలిసిందని , దీనిపై జగన్ కు నచ్చజెప్పి టికెట్ ఆమెకు ఇవ్వాలంటూ కోరానని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో ఆమెకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే తిరిగి నాకు టికెట్ ప్రకటించారన్నారు దువ్వాడ శ్రీనివాస్.
ఇక, తనను కలిసేందుకు వచ్చారని చెబుతున్నా వాణి, పిల్లలు ఇద్దరూ అర్దరాత్రి తన వద్దకు రావాల్సిన అవసరం ఏముందని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. అర్దరాత్రి అనుచరులతో కలిసి వచ్చి తన ఇంటి గోడను కూల్చి తనను కలవాల్సిన అవసరం ఏంటన్నారు. వాళ్ళను గమనించే బయటకు వస్తే తనను చంపేస్తారని ఇంట్లో నుంచి బయటకు రాలేదన్నారు దువ్వాడ శ్రీనివాస్.