సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే హిండెన్ బర్గ్ సంస్థ మరోసారి బిగ్ బాంబ్ పేల్చింది. ఈ సంస్థ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. గతేడాది హిండెన్ బర్గ్ నివేదిక ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అదానీగ్రూప్ పై వెలువరించిన నివేదిక దేశీయ స్టాక్ మార్కెట్ లను అతలాకుతలం చేసింది.
ఈ క్రమంలోనే హిండెన్ బర్గ్ శనివారం ఎక్స్ ఖాతాలో ‘సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ట్వీట్ చేసింది. దీంతో మరోసారి భారత మార్కెట్ లలో ఈ సంస్థ మరో బాంబ్ పేల్చనుందా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో అదాని గ్రూప్ ను టార్గెట్ చేయగా ఇప్పుడు ఏ కంపెనీని టార్గెట్ చేస్తుందో అన్న చర్చ జరుగుతోంది.
నిజానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా, భారత మార్కెట్లు మాత్రం పరవాలేదనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే హిండెన్ బర్గ్ నివేదిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని భయాలు నెలకొన్నాయి. శని ఆదివారాలు మార్కెట్లకు సెలవు. దీంతో సోమవారం హిండెన్ బర్గ్ నివేదిక ట్రేడింగ్ పై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.