పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు రాజకీయ నేపధ్యం కూడా వుంది. ప్రముఖ నాయకుడు, ఎంపీ టీజీ వెంకటేష్ కి ఆయన రిలెటివ్. అలాగే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆయన ఎప్పటినుంచో సాన్నిహిత్యంగా వున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇండస్ట్రీలో ఓపెన్ గా ఓ పార్టీ కూడా ఇచ్చారు. ఈ సమయంలో ఆయనకు రాజ్యసభ పదవి దక్కించుకోవాలన్న కోరిక వుందనే కొన్ని కథనాలు వచ్చాయి.
అయితే ఈ కథనాల సంగతి ఆయన దగ్గర ప్రస్తావిస్తే, తాను ఆ పదవికి ఎలిజిబుల్ కాదని తేల్చి చెప్పారు విశ్వప్రసాద్. ”నేను అమెరికా సిటీజన్ ని. రాజ్యసభ పదవిలో వుండాలంటే ఇండియన్ సిటీజన్ కావాలి. టెక్నికల్ గా చూసుకుంటే నేను ఆ పదవికి ఎలిజిబుల్ కాదు. నాకు ఆ కోరిక కూడా లేదు” అని కంప్లీట్ క్లారిటీ ఇచ్చారు విశ్వప్రసాద్. దాంతో కొన్నాళ్లుగా విశ్వ ప్రసాద్ పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న చర్చకు తానంతట తానే చెక్ పెట్టినట్టైంది. ప్రస్తుతం తన దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని, త్వరలో తమ సంస్థ వంద సినిమాల మైలు రాయిని చేరుకోనుందని ఘంటాపథంగా చెప్పారు విశ్వప్రసాద్. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ ఈ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.