వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబాన్ని రోడ్డున పడేయడంలో మీడియా పాత్ర కీలకంగా మారింది. వాళ్ల కుటుంబంలో చిచ్చు చాలా రోజులుగా ఉంది. అంతర్గతంగా పరిష్కరించుకోవడానికి వారి పాట్లేవో వారు పడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ అంశాన్ని మీడియా టేకప్ చేసిందో అప్పట్నుంచి ఆ కుటుంబం పరిస్థితి కల్లోలంగా మారిపోయింది.
దువ్వాడ కుమార్తె ఆయన ఇంటికి వెళ్లినప్పుడు.. మీడియా ప్రతినిధులు వెళ్లారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఫ్యామిలీ సర్కస్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఓ బతుకు జట్కాబండి తరహా షోని నడిపిస్తున్నారు. దువ్వాడ శ్రీవాణి దగ్గరకు వెళ్లి ఓ మైక్.. ఆమె అన్న మాటల్ని దివ్వెల మాధురీ దగ్గర చెప్పి మరో మైక్ పెట్టి కౌంటర్లు ఇప్పించి.. రాజుకునేలా చేస్తున్నారు. మధ్యలో అడల్టరీ గురించి చర్చలు పెట్టి న్యాయబద్దమో కాదో చెబుతున్నారు. చివరికి ఆ ఇద్దరు మహిళలకు పుట్టిన బిడ్డలు వారి తండ్రులకే పుట్టారో లేదో అని పరస్పరం ఆరోపణలు చేసుకునే వరకూ వ్యవహారం వెళ్లింది.
ఈ ఆరోపణల వ్యవహారం టీవీలకు టీఆర్పీల వేటకు పెద్ద ఆయుధంగా మారింది. జనాలు చూసేదే చూపిస్తామంటూ… దివ్వెల మాధురీ డాన్స్ వీడియోలు.. ఆమె అడల్టరీ గురించి.. తమ సంబంధాల గురించి దబాయించిన వైనం గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఇది చాలదన్నట్లుగా దువ్వాడ శ్రీను కూడా తెరపైకి వచ్చారు. ఇప్పుడీ సర్కార్ లో .. రింగ్ మాస్టర్లుగా టీవీ చానళ్లు మారిపోయాయి. ఇది చాలా దూరం వెళ్లేలా ఉంది. టీవీ చానళ్లు టీఆర్పీలు వస్తాయి కానీ దువ్వాడ కుటుంబం మాత్రం రోడ్డున పడింది. ఈ విషయాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారు.