తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం కాబోతుందా…? ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ తన నిర్ణయాలు చెబుతూనే మరిన్ని సంప్రదింపులు అని చెప్పటం దేనికి సంకేతం…? విస్తృత అభిప్రాయం పేరుతో కాలయాపన చేయబోతున్నారా…?
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు చూస్తే ఇవే అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అందులోనూ తెల్లరేషన్ కార్డుల కోసం గత పదేండ్లలో ఎన్నో లక్షల మంది ఎదురుచూశారు. వేలల్లో కూడా కొత్త కార్డులు జారీ కాలేదు. కనీసం హామీ ఇచ్చిన కొత్త ప్రభుత్వం వచ్చాక అయినా ఇవ్వకపోతుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా తెల్ల రేషన్ కార్డుతో లింక్ పెడుతున్నారు. పథకం ఏదైనా ఏకైక అర్హత తెల్లరేషన్ కార్డుగా మారిపోయింది. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజా పాలన దరఖాస్తు సమయంలో తెల్లరేషన్ కార్డు లేని వారి నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావటంతో… వైట్ పేపర్ పై వైట్ రేషన్ కార్డుకు వినతిపత్రం తీసుకున్నారు. అవి అలా పెండింగ్ లో ఉన్నాయి.
తెల్ల రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ఓ నిర్ణయానికి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి లక్ష ఆదాయం లేదా మగాణి 3.5ఎకరాలు, లేదా చెలక 7.5ఎకరాలు ఉన్న వారిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి 2లక్షల ఆదాయం పరిమితి విధించారు. అయితే, దీనిపై అన్ని పార్టీల అభిప్రాయాలతో పాటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేఖలు రాసి వారి సూచనలు స్వీకరించి… వాటి ఆధారంగా నిర్ణయాలుండాలని ప్రతిపాదించింది.
కానీ, ఇవి ఎప్పటికి పూర్తయ్యేది… కొత్త కార్డుల దరఖాస్తులు ఎప్పుడు తీసుకునేది… ప్రజలకు ఎప్పుడు అందేది… ఏదీ క్లారిటీ లేదు. దీంతో ప్రభుత్వ ప్రకటన చూసిన వారంతా ఇది కాలయాపన పనే అని ఫిక్సవుతున్నారు.