దమ్ముంటే మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని కేటీఆర్ .. కాంగ్రెస్ ను సవాల్ చేస్తున్నారు. నేరుగా రాహుల్ గాంధీకే ఈ సవాల్ చేస్తున్నారు కేటీఆర్. సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల వద్ద రిటైనింగ్ వాల్ కుప్పకూలిపోవడంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ ప్రాజెక్టులన్నీ ఇలాగే నిర్మించిందని.. మొన్న మేడిగడ్డ.. ఇప్పుడు సుంకిశాల అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులన్నింటికీ క్వాలిటీ చెక్ చేయిస్తామంటున్నారు.
అయితే దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని.. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని ఆయన నేరుగా రాహుల్ ను డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిస్పాక్షికంగా విచారణ జరిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. అయినాదీన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో, దీనికి బాధ్యులు ఎవరో చెప్పాలని ఆయన అంటున్నారు.
సుంకిశాల కాంట్రాక్ట్ మేఘా కంపెనీదే. ఆ కంపెనీ ఇప్పటి వరకూ కిక్కురుమనలేదు. మళ్లీ పూర్తి ఖర్చు పెట్టుకుని తామే నిర్మిస్తామని ప్రభుత్వానికి చెప్పింది. కానీ.. మేఘా అంటే.. ఇంతెత్తున లేచే కాంగ్రెస్ ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉందన్నదే కీలకం. కేటీఆర్ కు కూడా ఆ రహస్యం తెలిసిపోయింది. అందుకే ఆయన దమ్ముంటే .. మేఘాను బ్లాక్ లిస్టులో పెట్టాలని సవాల్ చేస్తున్నారు.