తెలంగాణ టీడీపీపై చంద్రబాబు చాలా ఆశలు రేపుతున్నారు. దాని వెనుక ఏ రాజకీయం ఉందో ఆయనకే తెలియాలి కానీ మాటలో చెబుతున్నదానికి చేతల్లో చూపిస్తున్నదానికి కనీస పొంత ఉండటం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్.. ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయానికి వ్యతిరేకంగా గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరిపోయారు. అప్పటి నుంచి టీ టీడీపీ అధ్యక్షుడు లేరు. ఇదిగో నియమిస్తారు.. అదిగో నియమిస్తారని ప్రచారాలు మాత్రం చేస్తున్నారు.
Read Also :తెలుగుదేశం అంటే తెలుగువారి పార్టీ
అందరూ వెళ్లిపోయినా ఇంకా పార్టీనే అంటి పెట్టుకున్న నాయకులు చాలా మంది ఉన్నారు. వారిలో మాస్ లీడర్లు లేకపోవచ్చు కానీ… చాన్స్ వస్తే ఫుల్ టైం పని చేయడానికి రెడీగా ఉన్నారు. అయినా చంద్రబాబు మనసులో ఏముందో కానీ పార్టీ అధ్యక్షుడ్ని మాత్రం నియమించలేదు. తాజాగా జరిగిన సమావేశంలోనూ అధ్యక్షుడిపై తేల్చలేదు. పార్టీ సభ్యత్వ కార్యక్రమం అయిపోయిన తర్వాత నియమిస్తామని అంటున్నారు. అధ్యక్షుడ్ని నియమించడానికి టీడీపీ అధినేతకు ఎలాంటి సమస్య లేదు. విరగబడిపోయేంత పోటీ లేదు. ఇప్పటికే టీ టీడీపీ ఉనికి తెలంగాణలో లేదు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలకు దిశానిర్దేశం లేదు. ఇక సభ్యత్వం ఎలా జరుగుతుంది ?
అయితే తెలంగాణలో మారబోతున్న రాజకీయాలతో చంద్రబాబు … తెలంగాణ టీడీపీ విషయంలో ఏదో ప్రణాళికతో ఉన్నారన్న ఓ నమ్మకం మాత్రం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. బడా లీడర్ ఎవరో వస్తారని.. టీ టీడీపీ పగ్గాలు చేపడతారని చాలా మంది ఊహించుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే అసాధ్యమైన వాటినీ కూడా ప్రచారంలోకి పెడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే.. వెంటనే టీ టీడీపీ అధ్యక్షుడ్ని నియమించుకోవాల్సి ఉంది. చంద్రబాబు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మరి !