ఎన్ని కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసినా ‘హీరో’ ఇమేజ్ తీసుకొచ్చేవి మాస్ మసాలా యాక్షన్ కమర్షియల్ సినిమాలే. అందుకే హీరోలకి ఇది ఫేవరేట్ జోనర్. అయితే ఈ జోనర్ లో ప్రేక్షకులని అలరించడం అంత తేలిక కాదు. ఎందుకంటే మాస్ కమర్షియల్ సినిమా అనేది అరిగిపోయిన టెంప్లెట్. అందులో కొత్తదనం చూపించడం చాలా శ్రమతో కూడుకున్న పని. వరుసగా కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న మలయాళం స్టార్ మమ్ముట్టి చాలా రోజుల తర్వాత ‘టర్బో’తో ఓ మాస్ మసాలా యాక్షన్ సినిమా చేశారు. సోనీ లీవ్ ఓటీటీ లో సినిమా స్ట్రీమ్ లోకి వచ్చింది. స్వయంగా మమ్ముట్టి నిర్మించిన సినిమా ఇది. మరి ఇందులో ఆయన మాస్ యాక్షన్ ఎలా వుంది? ఈ యాక్షన్ కథలోని కొత్తదనం ఏమిటి?
జోస్ అలియాస్ టర్బో(మమ్ముట్టి) ఓ జీప్ డ్రైవర్. తనకు దూకుడెక్కువ. ఫైటింగులు చేసే అలవాటు కూడా వుంటుంది. తన జోలికి ఎవరైనా వస్తే ఇక అంతే. అయితే ఇంత దూకుడుగా వుండే జోష్ తన తల్లి ముందు పిల్లిలా ఉంటాడు. తల్లి ఏం చెప్తే అదే. జోష్ స్నేహితుడే జెర్రీ (శబరీశ్). చెన్నైలోని ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. ఇందులేఖ (అంజనా జయప్రకాశ్)ని ప్రేమిస్తాడు. తను బ్యాంక్ మ్యానేజర్. జెర్రీ ప్రేమ గురించి తెలుసుకున్న జోష్.. తన దూకుడు స్వభావంతో ఇందుని ఎత్తుకొచ్చేస్తాడు. ఇంట్లోవారికి భయపడి ఇందు ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తాడు జెర్రీ. దీంతో ఇందు ఆ రాత్రికే చెన్నయ్ వెళ్ళిపోతుంది. ఇందు తల్లిదండ్రులు కేసు పెట్టడంతో జోస్ ఇంటికి వస్తారు పోలీసులు. దీంతో జోష్, ఇందుతో పాటు చెన్నయ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంతలో అనూహ్యంగా జెర్రీ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. జెర్రీ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? తన చావు వెనుక ఎవరున్నారు? నిజాన్ని తెలుసుకున్న తర్వాత జోష్ కి ఎదురైన సవాళ్ళు ఏంటి? ఇదంతా మిగతా కథ.
హీరో- విలన్ వార్ ని ఎంత కొత్తగా చూపిస్తున్నామనే పాయింట్ మీదే యాక్షన్ సినిమాల ఫలితం ఆధారపడి వుంటుంది. టర్బో విషయానికి వస్తే దర్శకుడు వైశాఖ్ కొంత కొత్తదనం చూపించే ప్రయత్నమైతే చేశాడు. దీపావళి రోజున ఓ కుటుంబాన్ని ఓ గ్యాంగ్ హతమార్చిన సీన్ తో కథ మొదలౌతుంది. ఇదొక బ్యాంక్ స్కామ్. అయితే స్కామ్ లోకి కేరళలో జీపు నడుపుకుంటూ, ఊర్లో ఫైట్లు చేసుకుంటూ హాయిగా బ్రతికేస్తున్న జోష్ క్యారెక్టర్ ని ఎలా తీసుకొచ్చారనే జర్నీ ఆసక్తిగానే వుంటుంది. దీన్ని సీరియస్ యాక్షన్ ఫిల్మ్ లా కాకుండా కామెడీ కోటింగ్ ఇస్తూ నడిపారు. జోష్ పరిచయం, తల్లితో అతనికి వున్న బాండింగ్, జెర్రీ ప్రేమ కథ, ఇందులేఖ ని తీసుకురావడం, ఆమె వెంట మళ్ళీ చెన్నయ్ వెళ్ళడం.. ఇవన్నీ లైటర్ వెయిన్ లో సాగుతాయి.
ఎప్పుడైతే జెర్రీ ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడి నుంచి సినిమా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కింగ్ మేకర్ వెట్రివేల్ షణ్ముగం (రాజ్ బి.శెట్టి) క్యారెక్టర్, ఆయన బ్యాక్ డ్రాప్ మరీ కొత్తగా అనిపించపోయినా ఎంగేజింగ్ వుంటుంది. ఎప్పుడైతే ఈ హత్యవెనుక ఓ బ్యాంక్ స్కాం, పెద్దవాళ్ళ చేతులు వున్నాయని జోష్ తెలుసుకుంటాడో అక్కడే కాస్త కొత్తగా అలోచించాడు డైరెక్టర్. బేసిక్ గా ఇలాంటి పరిస్థితిలో హీరోలు, విలన్స్ అందరినీ ఒంటిచేత్తో చిదిమేసే టైపు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. కానీ జోష్ క్యారెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా ప్రాణం చేతిలో పట్టుకొని తల్లితో కలిసి విలన్ నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. ఇక తప్పదనుకునే పరిస్థితిలో యాక్షన్ లోకి దిగుతాడు. దీంతో ఆ ట్రాక్ కి ఎమోషన్ కూడా యాడ్ అయ్యింది. దాదాపు చివరి 40 నిముషాలు యాక్షన్ తో నిండిపోతుంది. హీరో విలన్ మధ్య మైండ్ గేమ్ కొత్తగా అనిపించదు కానీ మరీ రొటీన్ ఐతే వుండదు.
టర్బోలో కొన్ని లోపాలు కూడా కనిపిస్తాయి. బ్యాంక్ స్కామ్ చుట్టూ నడిచే కథ ఇది. అయితే ఈ కథలోకి హీరోని తీసుకురావడంలో చాలా సమయం తీసుకున్నారు. ఈ పోర్షన్ ఇంకాస్త తర్వగా ముగించాల్సింది. ఇందులో సునీల్ ట్రాక్ వుంది. అది డార్క్ కామెడీ అనుకున్నారు కానీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో పాటు జెర్రీ, ఇందులేఖ ప్రేమ కథపై కూడా దర్శకుడు శ్రద్ద తీసుకోలేదు. అలాగే ఇందులో హీరోయిజం ఏకపక్షంగా వుంటుంది. హీరో రంగంలోకి దిగితే ఇక అడ్డే వుండదనే తరహాలో చూపించడం రొటీన్ ఫీలింగ్ కలిగిస్తుంది.
మముట్టి స్క్రీన్ ప్రజెన్స్, పెర్ఫార్మెన్స్ టర్బో కి ప్రధాన బలం. జోష్ క్యారెక్టర్ లో ఆయన మాస్ శ్వాగ్ భలే వుంటుంది. ఆయన పెర్ఫార్మెన్స్ తో చాలా వరకూ ఎంగేజ్ చేసి ఉంచారు. రాజ్ బి.శెట్టి క్యారెక్టర్ కూడా బాగా కుదిరింది. మముట్టితో పోటీపడి మరీ నటించారు. జోష్ తల్లిగా కనిపించిన నటి నేచురల్ గా వుంది. సునీల్ గాడ్ ఫాదర్ గెటప్ బావుంది. ఇందులేఖ, జెర్రీతో పాటు మిగతా వారంతా పాత్రల మేరకు నటించారు. మ్యూజిక్, కెమరా పనితనం సినిమాకి మరో ఆకర్షణ. మమ్ముటి పాత్రకు ఇంకాస్త ఇంటెన్స్ వాయిస్ తో తెలుగు డబ్బింగ్ చెప్పించాల్సింది.
ఈ సినిమా చివర్లో కొసమెరపు వుంది. ఈ మొత్తం స్కామ్ వెనుక విజయ్ సేతుపతి వున్నారనే అర్ధం వచ్చేట్లు ఆయన వాయిస్ వినిపిస్తుంది. టర్బో పార్ట్ 2 వస్తే గనుక మమ్ముట్టి, విజయ్ సేతుపతి ఫేస్-అఫ్ ఆటోమేటిక్ గా క్రేజ్ ని పెంచుతుంది. టర్బో వరకైతే ఓటీటీలో వుంది కాబట్టి ఓసారి నిరభ్యంతరంగా చూడొచ్చు.