వైసీపీ ఎంపీ, లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి తెలివిగా మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల కిందట బీజేపీలో చేరే ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదన్న ప్రచారం విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్న మిథున్ రెడ్డి..2014లోనే తనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది.. ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. 2014లో బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది..పైగా కూటమిలో నాడు టీడీపీ భాగస్వామిగా ఉంది. ఆ సమయంలో అదీ మొట్ట మొదటి సారి ఎంపీ ఆయిన మిథున్ రెడ్డి చేరిక కోసం బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసిందని వ్యాఖ్యానించడం నమ్మశక్యం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
మిథున్ రెడ్డి కొద్ది రోజులక్రితం బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని కానీ, బీజేపీ నుంచి సరైన సిగ్నల్స్ రాలేదనే ప్రచారం జరుగుతుండటం..ఈ ప్రచారాన్ని ఖండించేందుకు ఈ విషయం వెల్లడించడం పట్ల కొత్త సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారన్న చర్చ నేపథ్యంలో మిథున్ రెడ్డి వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా మారాయి.
ఇప్పుడు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చేందుకే మిథున్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్న టాక్ నడుస్తోంది. పైగా తాజా వ్యాఖ్యల ద్వారా తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీజేపీలో చేరుతానని పరోక్షంగా సంకేతాలు పంపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, మిథున్ రెడ్డికి ఆ ఛాన్స్ లేదని అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు.