మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రులంతా అజ్ఞాతంలోకి వెళ్లగా..మొదట కూటమిపై విమర్శలు గుప్పించింది గుడివాడే. అలాంటి నేత విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సైలెంట్ కావడం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది.
అయితే, బొత్సకు విశాఖ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై గుడివాడ నొచ్చుకున్నారని, విజయనగరంకు చెందిన నేతకు విశాఖ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అంటే తమను అవమానించడం అనే అభిప్రాయానికి గుడివాడ వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. వైసీపీ హయాంలో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అమర్ నాథ్ ను కాదని పక్క జిల్లాకు చెందిన నేతకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారంటే, గుడివాడ సామర్థ్యంపై జగన్ కు నమ్మకం లేదని మెసేజ్ ఇవ్వడమేనని అందుకే ఆయన సైలెంట్ అయ్యారని అంటున్నారు.
వాస్తవానికి విశాఖ ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు గుడివాడ అమర్ నాథ్. స్థానిక సంస్థల్లో వైసీపీకి బలం ఉండటంతో ఒకవేళ అన్ని అనుకూలించి గెలిస్తే ఎంచక్కా 2027వరకు ఎమ్మెల్సీగా కొనసాగవచ్చు అని భావించారు. కానీ, జగన్ మాత్రం సీనియర్ నేత బొత్సకు అవకాశం ఇవ్వడంపై అసంతృప్తితోనే గుడివాడ సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై ఆశలు మిణుకుమిణుకు అంటున్నా నేపథ్యంలో సీనియర్ నేత గుడివాడ సైలెన్స్ ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన కనిపిస్తోంది.