వైసీపీకి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీని వీడుతున్నా.. వారంతా ఏ పార్టీలో చేరుతారో ప్రకటించడం లేదు. అయినా పార్టీని వీడి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అయితే, వారంతా వ్యూహాత్మకంగానే వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారని అంటున్నారు.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మొదట ఆ పార్టీకి రాజీనామా చేసింది రావెల కిషోర్ బాబు. ఆ తర్వాత సిద్ధా రాఘవరావు , గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ రావు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పెండెం దొరబాబు.. ఇలా ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు.వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల నాని కూడా ఇటీవల షాక్ ఇచ్చారు. ఆళ్ల నాని మినహా మిగతా నేతలు ఏ పార్టీలో చేరుతామని ప్రకటించడం లేదు. వీరంతా ముందు వైసీపీ నుంచి బయట పడటమే మంచిది అనే ఉద్దేశంతోనే రాజీనామాలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీని వీడిన నేతలు కొంతమంది కూటమి పార్టీలో చేరాలని అనుకుంటున్నారు. కానీ కూటమి పార్టీల నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందా..? అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం చేరికలపై కూటమి పార్టీలు దృష్టి కూడా పెట్టడం లేదు. అయినా వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి.
రోజురోజుకు కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం.. వైసీపీ ఊహించని స్థాయిలో బలహీనం అవుతుండటంతో ఫస్ట్ ఐతే వైసీపీని వీడటం మంచిది అనే ఆలోచనతోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు అని అంటున్నారు. కొద్ది రోజుల తర్వాత చేరికలకు కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే అప్పుడు ఆ పార్టీలో చేరేందు కోసమే ఈ నిర్ణయాలు అనే అభిప్రాయం వినిపిస్తోంది.