హైదరాబాద్లో ఇప్పుడు కాస్త ఎగువ మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనాలంటే.. గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్మిస్తున్న హైరైజ్ అపార్టుమెంట్ల వైపు చూస్తున్నారు. ఒకప్పుడు పదిహేను అంతస్తుల వరకూ ఉంటే చాలా గొప్ప .. కానీ ఇప్పుడు 30 నుంచి 50 అంతస్తుల వరకు నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఎక్కడా హైదరాబాద్లో ఏదైనా గుట్టపైకి ఎక్కితే చుట్టూ హైరైజ్ అపార్టుమెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వీటికి బాగా ఆదరణ ఉన్నట్లే.
రెండేళ్ల కిందటి వరకూ హైరైజ్ అపార్టుమెంట్లలో నివాసం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. విశాలమైన ఓపెన్ ప్రదేశాలు.. స్విమ్మింగ్ పూల్, పిల్లల ఆట ఏరియా, టెన్నిస్ కోర్టులు వంటివి ఉండేవి. అంత ఉన్నా.. వాకింగ్ ట్రాక్ కూడా సెపరేట్ గా ఉండేది. అంటే సగటున ఓ కమ్యూనిటిలో ఐదు వందల ఫ్లాట్లు హైరైజ్ అపార్టుమెంట్లో ఉంటే… ఒక్కో ఫ్లాట్ కొనుగోలుదారునికి సగటున వంద గజాల వరకూ వచ్చేది. కానీ రాను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మారిపోతోంది. ఇప్పుడు అది యభై గజాలకు దిగజారిపోయింది. పైగా రేట్లు మాత్రం ఊహించని విధంగా ఉంటున్నాయి. వాటిపై రిటర్న్స్ వస్తాయా లేదా అన్నది ఊహించడం కష్టం.
బ్రాండెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు హైదరాబాద్లో ఓ పది వరకూ ఉంటాయి. అవి వాటి పేరును చూపించి విపరీతంగా మార్కెట్ చేసుకుటున్నాయి. తాజాగా ఐటీ కారిడార్ కు దగ్గరగా ఓ సంస్థ హైరైజ్ అపార్టుమెంట్లకు పునాది రాయి వేసింది. భారీ ప్రచారం చేసుకుంది. గతంలో ఆ పక్కన మరో సంస్థతో కలిసి నిర్మించే అపార్టుమెంట్లకూ అలాగే కృత్రిమ గిరాకీ సృష్టించుకుని భారీగా ప్లాట్లు బుక్ చేసుకుంది. అయితే ఇప్పటికీ ఆ అపార్టుమెంట్లో రేట్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కొత్త వెంచర్ లో ఆఫర్ చేస్తున్న రేట్లు కాస్త రీజనబులే అన్నట్లుగా ప్రచారం చేశారు కానీ.. ఫ్లాట్ హ్యాండోవర్ చేసే నాటికి పెట్టే పెట్టుబడుకి ఎంత రిటర్ను వస్తుందని ఆలోచిస్తే.. సేవింగ్స్ ఖాతాల్లో ఉండే బ్యాంకు వడ్డీ కూడా కష్టమని నిపుణులు తేల్చారు.
అయితే బ్రాండ్ పేరు.. ప్రచారం కారణంగా … కొంత మంది కొనుగోలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే హైరైజ్ అపార్టుమెంట్లు కొనుగోలు చేసేటప్పుడు.. బుక్ చేసేటప్పుడు ముందుగా గుర్తుంచుకోవాల్సింది.. బ్రాండ్ నేమ్ మాత్రమే కాదు.. మనం పెట్టే పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం.. రిటర్న్స్ వస్తున్నాయా లేక అవి కూడా బిల్డర్ ఖాతాలో వేసుకుంటున్నారా అన్నదే. అంటే… నాలుగేళ్ల తర్వాత ఉండే రేటును ఇప్పుడే పబ్లిసిటీ చేసుకుని వసూలు చేస్తున్నాడనే. అందుకే.. హైరైజ్ అపార్టుమెంట్లను బుక్ చేసుకునే ముందు.. విస్తీర్ణం, ఫ్లాట్లు.. సౌకర్యాలు.. వాటికయ్యే ఖర్చులూ మొత్తం ఆరా తీసుకుని.. లెక్కలేసుకుని ముందడుగు వేయడం మంచిది.