రాయలసీమకు అతి పెద్ద మెట్రో సిటీగా తిరుపతి రూపుదిద్దుకుంటోంది. దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక నగరంగా ఉన్న తిరుపతి శరవేగంగా విస్తరిస్తోంది. క్రమంగా మెట్రో సౌర్యాలను.. ఆ లక్షణాలను అంది పుచ్చుకుంటోంది. ఇటీవల రియల్ ఎస్టేట్ దిగ్గజం కొలియర్స్ ఇండియా సంస్థ తిరుపతిని ఎక్కువ గ్రోత్ రేట్ ఉన్న సిటీల జాబితాలో చేర్చింది.
ఆధ్యాత్మిక పర్యాటకం మాత్రమే కాదు.. ఇతర వ్యాపారాలు, పరిశ్రమలకు తిరుపతి కేంద్రంగా మారింది. దక్షిణాదిన కోయంబత్తూరు, కొచ్చిన్, విశాఖతో పాటు తిరుపతి కూడా హాట్ ప్రాపర్టీనేనని అంచనా వేశారు. ఇప్పటికే తిరుపతి నగరం అర్బన్ మండల పరిధిని దాటి రూరల్ మండలం, చంద్రగిరి, రేణిగుంట, వడమాలపేట, రామచంద్రాపురం, ఏర్పేడు మండలాల్లోకి విస్తరించింది.
తిరుపతి నుంచీ కడప, నెల్లూరు, చెన్నై, చిత్తూరు, మదనపల్లె వెళ్ళే మార్గాలు జాతీయ రహదారులుగా మారాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో పాటు చుట్టుపక్కల అనేక చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఆలయాలు వుండడంతో పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం విశ్రాంత జీవితాన్ని తిరుపతి, తిరుపతి పరిసరాల్లో గడిపేందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి నివాసాలు ఏర్పరుచుకోవడం, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేయడం క్రమేపీ పెరుగుతోంది.
ప్రభుత్వాలు మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉపాధి కల్పనకూ పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆకర్షిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మాన్యూఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వచ్చే పదేళ్లలో తిరుపతి హాట్ ప్రాపర్టీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.