మెగా కుటుంబం అనగానే అందరిలోనూ ఓ అటెన్షన్ వచ్చేస్తుంటుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం వాళ్ల చేతుల్లో ఉన్నట్టు మాట్లాడుకొంటుంటారు. అయితే మెగా వారసత్వాన్ని కొనసాగించడం అంత సులభమైన విషయం ఏం కాదు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో గీతా ఆర్ట్స్ మినహా ఎవరికీ పెద్దగా కలిసొచ్చింది లేదు. నాగబాబు నిర్మాతగా సంపాదించిన దానికంటే పోగొట్టుకొన్నదే ఎక్కువ. అంజనా ప్రొడక్షన్స్ ద్వారా నాగబాబుకి మిగిలిందేం లేదు. పైగా ‘ఆరెంజ్’తో అంతా పోగొట్టుకొన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణం ప్రారంభించినా చెప్పుకోదగ్గ విజయాలేం లేవు. చిరంజీవి కుమార్తె కూడా నిర్మాత సుస్మిత గోల్డ్ బాక్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని స్థాపించింది. తీసినవి చిన్న సినిమాలే. కానీ హిట్లు లేవు. ఓరకంగా చిరంజీవి ఫ్యామిలీకి సినీ నిర్మాణం అంతగా కలిసి రాదేమో అనుకొంటున్న తరుణంలో నిహారిక ఓ మంచి విజయాన్ని అందుకొంది. ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో.
పరిమిత బడ్జెట్ తో, దాదాపు అంతా కొత్తవాళ్లతో నిహారిక తీసిన సినిమా ఇది. సినిమా మొదలెట్టి చాలా కాలం అయ్యింది. మెల్లమెల్లగా పూర్తయి, ఈవారమే విడుదలైంది. మంచి స్పందన వచ్చింది. వసూళ్లు నిలకడగా ఉన్నాయి. అయితే సినిమాకు పాజిటీవ్ రివ్యూలొచ్చాయి. మహేష్ బాబు లాంటి స్టార్ కూడా ఈ సినిమా చూసి నిహారిక ప్రయత్నాన్ని మెచ్చుకొన్నాడు. బాక్సాఫీసు దగ్గర అద్భుతమైన వసూళ్లు, ఊహకందని కలక్షన్లు రాకపోవొచ్చు కానీ, నిర్మాతగా నిహారిక సేఫ్. దాంతో పాటు కొత్త టాలెంట్ ని పరిశ్రమకు పరిచయం చేశానన్న తృప్తి నిహారికకు మిగిలింది. ఈ స్ఫూర్తితో నిహారిక మరిన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తన ఇంట్లో చాలామంది హీరోలున్నారు. వాళ్ల డేట్లు సంపాదించడం నిహారికకు పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ ఇప్పుడు తన ఫోకస్ బయటి హీరోలపై ఉంది. `కథ ఏ హీరోని డిమాండ్ చేస్తే ఆ హీరోతో సినిమా చేస్తా. ఇంట్లో హీరోలున్నారు కదా అని నేను అడ్వాంటేజ్ తీసుకోను` అంటోంది నిహారిక. ఇది మంచి ఆలోచనే. ముందు రచ్చ గెలిస్తే.. ఆ తరవాత ఇంట గెలవడం తేలిక. ఈ విషయం నిహారికకు బాగా అర్థమైంది. నాగబాబు నిర్మాతగా సాధించలేని చోట… తను తొలి అడుగులోనే విజయాన్ని అందుకోగలిగింది.