తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సాగిపోతోన్న సీఎం రేవంత్ విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. పలు దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా రేవంత్ అండ్ టీమ్ ప్రయత్నిస్తోన్నా.. ఓ కంపెనీలో రేవంత్ రెడ్డి సోదరుడు డైరక్టర్ గా ఉండటాన్ని చూపించి ఆయన అమెరికా పర్యటనను రాజకీయం చేస్తోంది. రేవంత్ రెడ్డి సోదరుల ఆస్తులను పెంచేందుకు ఈ టూర్ చేపట్టారంటూ ఆరోపణలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని రేవంత్..తెలంగాణకు చేరుకోగానే బీఆర్ఎస్ ను గట్టిగా వాయించడమే కాకుండా, గట్టి ట్రీట్మెంట్ ఇస్తారనే చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎదురుదాడిని ఓ కంట గమనిస్తూనే..మరోవైపు ఆ పార్టీకి ఊపిరాడకుండా చేసేందుకు రేవంత్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం అమెరికా నుంచే రేవంత్ ఆపరేషన్ చేపట్టారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేలా ప్లాన్ చేయాలంటూ పార్టీ సీనియర్ నేతలకు ఆదేశాలు ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read : డీఎస్సీ పూర్తైనా… టీచర్ల ఎంపికలో ఎందుకింత ఆలస్యం?
ఇటీవలి కొన్ని సంఘటనలతో ఇక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ముగిసినట్టేనని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది. ఎమ్మెల్యేల వలసలపై తాము చేస్తోన్న పోరాటంతో కాంగ్రెస్ కూడా డిఫెన్స్ లో పడిందని కేటీఆర్ భావిస్తున్నారు. కానీ, రేవంత్ విదేశీ పర్యటన ముగిసాక మళ్లీ ఈ చేరికల జాతర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు, ఆషాడమాసం రావడమే చేరికలకు అడ్డు నిలిచిందని, అంతేకాని బీఆర్ఎస్ ఎల్పీ విలీనం విషయంలో రేవంత్ వెనక్కి తగ్గలేదని అంటున్నారు. పైగా , రేవంత్ విదేశీ పర్యటనపై కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా రాజకీయం చేస్తోన్న బీఆర్ఎస్ కు రేవంత్ ఊహించని విధంగా ట్రీట్మెంట్ ఇస్తారని , ఈ విషయంలో బీఆర్ఎస్ రాజకీయాలే రేవంత్ ను మరింత ప్రేరేపించాయని అంటున్నారు.