సినిమా వాళ్ళకి ‘ఫ్లాప్’ భయం వెంటాడుతుంటుంది. ఫ్లాఫ్ వస్తే ఒప్పుకోవడానికి చాలా భయపడిపోతుంటారు. ”ఆ సినిమా ఫ్లాఫ్ కాదండీ. మేము దానికేం నష్టపోలేదు. పైపెచ్చు ఓ అర్ధ రూపాయి లాభమే చూశాం. కానీ అభిమానులు ఆశించేలా ఆ సినిమా తయారుకాలేదు. మాములు ఆడియన్స్ బాగానే చూశారు” ఇలాంటి కవర్ షాట్లు ఆడుతుంటారు. కొందరైతే ఫ్లాఫ్ సినిమాని ప్రస్థావించడానికి కూడా ఇష్టపడరు. అసలు ఆ సినిమా తమ ఫిల్మోగ్రఫీలో లేదన్నట్లుగా బిహేవ్ చేస్తారు. మీడియా ఇంటర్వ్యూల్లో సదరు ఫ్లాఫ్ సినిమా ప్రస్థావన రాకుండా చూసుకుంటారు.
కానీ ఈ విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ రూటే వేరు. ఫ్లాప్ ని ఫ్లాఫ్ అని అంగీకరించడంలో ఆయనకి ఎలాంటి భయం లేదు. డబుల్ ఇస్మార్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన స్పీచ్ ని పరిశీలిస్తే తన హిట్లు కంటే ఫ్లాపులనే గుర్తు చేసుకుని మాట్లాడారు. లైగర్ ఫ్లాఫ్ అయినప్పుడు రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేసిన కాల్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఫ్లాపుల్లో వున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమా చేశానన్నారు.
నిజానికి ఈ వేదికలో లైగర్ ని ప్రస్థావించిన అవసరం లేదు. ఇండస్ట్రీ, హీరోయిజం లెక్కలు మార్చేసిన డైరెక్టర్ పూరి. కమర్షియల్ కల్ట్ క్లాసిక్కులు తీసిన డైరెక్టర్ తను. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో ఫలానా తన హిట్ సినిమాకి మించి ఈ సినిమా ఉంటుందని చెబుతుంటారు డైరక్టర్స్. అంతేందుకు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వస్తోంది డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ మాస్ లో మంచి హిట్ కొట్టిన సినిమా. దానికి డబుల్ ఉంటుదని చెప్పి హైప్ పెంచే అవకాశం వుంది. కానీ పూరి స్పీచ్ ఆ దిశగా వెళ్ళలేదు. తను ఫ్లాప్స్ లో వున్నానని, హిట్ కావాలని ఒళ్ళు దగ్గరపెట్టుకొని సినిమా అని చెప్పడం పూరి లాంటి డైరెక్టర్ కే సాధ్యం. నిజంగా ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమా తీసి ఉంటే ‘లైగర్’ని ఫ్లాప్ ని మర్చిపోయే ఛాన్సుంది.